పల్నాడు, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రంలో జిల్లా, రెవెన్యూ డివిజన్, మండలాల సరిహద్దుల్లో మార్పుచేర్పులపై ప్రతిపాదనలను మంత్రివర్గ ఉపసంఘం సానుకూలత వెలిబుచ్చింది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘం, రెవెన్యూ శాఖలు స్పష్టత నిచ్చాయి. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురం, చిత్తూరు జిల్లాలోని మదనపల్లెను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలనే అభిప్రాయానికి వచ్చాయి.
అయితే చాలా పరిమితంగా జిల్లా, డివిజన్, మండలాల పునర్‌వ్యవస్థీకరణ చేపట్టాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించటంతో గతం నుంచి ప్రజలు ఆకాంక్షిస్తున్న పలు అంశాలు, ప్రతిపాదనలకు ప్రాధాన్యత లేకుండా పోయింది.పాలనా సౌలభ్యం, ప్రజల చిరకాల డిమాండ్ల పరిశీలనలో ఈ మార్పులు జరగనున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇందులో పల్నాడులో జిల్లాలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు.
ప్రజల మనోభావాలకు విరుద్దంగా
గత వైసీపీ ప్రభుత్వంలో పలు జిల్లాల ఏర్పాటులో భాగంగా 26 జనవరి 2022న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాలలో ఒకటిగా పల్నాడు జిల్లా ఏర్పాటైంది. సుమారు 4,591 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో గురజాల, నరసరావుపేట రెవెన్యూ డివిజన్ల ప్రాతిపదికన 28 మండలాలు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పల్నాడు జిల్లా ఏర్పాటైంది. అయితే అప్పట్లో పల్నాడు జిల్లా ఏర్పాటు సమయంలో ప్రజల నుంచి పలు డిమాండ్లు వచ్చాయి.
పలు పార్టీలు, ప్రజా సంఘాలు తమ ఆకాంక్షను వ్యక్తపరుస్తూ ఆందోళనలు నిర్వహించారు. పల్నాడు జిల్లా ఏర్పాటు వెనుకబడ్డ ప్రాంతంలోనే జరగాలన్న డిమాండ్ ఆయా ప్రాంత ప్రజల నుంచి అనూహ్యంగా తెరపైకి వచ్చింది. వెనకపడిన గురజాల, మాచర్ల, వినుకొండ నియోజకవర్గాలు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని, దశాబ్దాలుగా ఈ నియోజకవర్గాలు విద్య వైద్యం ఉపాధి కల్పలనలో వెనుక బడ్డాయని అక్కడి ప్రజలు ఆందోలనలకు దిగారు.
ఈ ప్రాంతాల ప్రజలకు సాగర్ తీరం చెంతనే చెప్పుకోదగిన అభివృద్ధి జరగలేదని, పరిశ్రమల ఏర్పాటు..పరిపాలన సౌలభ్యం మౌలిక వసతుల లేమితో వెనకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నాయని వాదించారు. ఈ నేపథ్యంలోనే పల్నాడు జిల్లా వెనకబడ్డ ప్రాంతంలోనే ఏర్పాటు చేయడం చారిత్రక అవసరం ఉందని పట్టుబట్టారు. పల్నాడు జిల్లా ఏర్పాటు ప్రతిపాదనలు తెరపైకి రాగానే గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా సాధన ఉద్యమం మొదలైంది.
పార్లమెంట్ నియోజకవర్గ ప్రాతిపదికన కాకుండా.. భౌగోళిక స్వరూపాన్ని ప్రమాణికంగా పల్నాడు జిల్లా ఏర్పాటు చేయాలని అప్పట్లో ప్రజలు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా వెనుకబడ్డ ప్రాంతాలైన గురజాల, మాచర్ల, వినుకొండ నియోజకవర్గాల పరిధిలోనే జిల్లా ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు. అప్పట్లో వైసీపీ మినహ అన్ని పార్టీలు ఒకటయ్యాయి. గురజాలలో ప్రస్తుత ఎమ్మెల్యే , అప్పటి మాజీ ఎమ్మెల్యే యరపతినేని ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో.. అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు పాల్గొన్నారు. గురజాల కేంద్రంగానే పల్నాడు జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పల్నాడు చరిత్రకు ఎలాంటి సంబంధంలేని నరసరావుపేటను జిల్లా కేంద్రంగా చేయడం ఏంటని పలువురు వ్యతిరేకించారు. పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలన్న డిమాండ్ చాలా కాలంగా స్థానిక ప్రజలు, దళిత సంఘాలు, రాజకీయ నాయకులు, సాంస్కృతిక వర్గాల నుంచి వ్యక్తమౌతోంది.
పల్నాడు జిల్లాలోని వినుకొండ సమీపంలోని చాట్రగడ్డ పాడు గ్రామంలో జన్మించిన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా పేరు పెట్టాలని ప్రజల డిమాండ్. పల్నాడు జిల్లా ఏర్పాటులో స్థానిక ప్రజల మనోభావాలకు అప్పటి ప్రభుత్వం విలువ ఇవ్వలేదని విమర్శలు కూడా వచ్చాయి.
గుర్రం జాషువా గుర్తుకురాలే….
పల్నాడు జిల్లా పేరును కవి గుర్రం జాషువా పెట్టాలని వచ్చిన డిమాండ్‌పై కూడా మంత్రివర్గ ఉప సంఘం దృష్టి సారించినట్లు కనపడలేదు. ఈ అంశంపై జిల్లా సరిహద్దుల మార్పు, పేర్ల మార్పు దిశగా కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలని ఆశిస్తున్న వారికి నిరాశే ఎదురైంది. పేరు మార్పు అంశంపై ప్రజా ప్రతినిధులు, దళిత సంఘాల నేతలు తిరిగి మరో సారి ఉద్యమించటానికి సిద్దంగా ఉన్నట్లు చెబుతున్నారు.
ప్రజల్లో అసంతృప్తి
అయితే చాలా పరిమితంగా జిల్లా, డివిజన్, మండలాల పునర్‌వ్యవస్థీకరణ చేపట్టాలని మంత్రివర్గ ఉపసంఘం ముందే భావించటంతో పల్నాడు జిల్లాలో మార్పులపై దృష్టి సారించలేదని తెలుస్తుంది. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ప్రకటన వెలువడినప్పటి నుంచి పల్నాడు జిల్లాలో మార్పులపై ప్రజలు ఆసక్తిగా గమనించారు. గతం నుంచి ఉన్న ప్రజల డిమాండ్ల అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారని వేచి చూశారు. కాని మంత్రి వర్గ ఉప సంఘం చేసిన సిఫార్సుల్లో జిల్లా పేరు లేకపోవడంతో మార్పును ఆశిస్తున్న ప్రజలు తీవ్ర అసంప్తూర్తితో ఉన్నారు. నాటి ప్రభుత్వంలో జరిగిన తప్పును సరిచేస్తామని ప్రకటించిన ప్రభుత్వం పల్నాడు ప్రజల మనోభావాలకు విలువ ఇవ్వలేదని కొంతమంది మండి పడుతున్నారు. మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా పునర్ వ్యవస్థీకరణ లో పల్నాడు జిల్లాలో ఎటువంటి మార్పులు లేకపోవడం విశేషం.

