ఇంచార్జ్ మంత్రి సాక్షిగా ఎమ్మెల్సీ పై దాడికి యత్నం
పులివెందుల అర్బన్, ఏప్రిల్ 8 (ఆంధ్రప్రభ) : పులివెందులలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. శాసన మండలి సభ్యుడు రాంగోపాల్ రెడ్డిపై పార్ధ సారధి రెడ్డి వర్గం దాడికి ప్రయత్నించారు మంగళవారం పట్టణంలోని శ్రీకర్ ఫంక్షన్ హాల్ లో పులివెందుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఇంచార్జ్ మంత్రి సవితమ్మ, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బిటెక్ రవి )లు హాజరయ్యారు.
సమావేశం ప్రారంభం అవుతుండగా పార్థసారధి రెడ్డి సోదరుడు శేషారెడ్డి ఒక్కసారిగా రాంగోపాల్ రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా సమావేశం రసాభాసగా మారింది. కడప జిల్లా ఇన్చార్జ్ మంత్రి సవితమ్మ సాక్షిగా ఇరువర్గాలు బాహా బాహీకి దిగారు. రాంగోపాల్ రెడ్డి వర్గం, పార్థసారథి రెడ్డి వర్గం చాలా సంవత్సరాలుగా వర్గ విభేదాలున్నాయి. జిల్లా ఇన్చార్జ్ మంత్రి సవితమ్మ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, పులివెందుల నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జ్ బీటెక్ రవిలు ఇరువర్గాలను శాంతింపజేశారు. దీంతో సర్వసభ్య సమావేశం యధావిధిగా కొనసాగింది.
