TG | గ్రాడ్యుయేట్ల పక్షాన పోరాటాలు చేశారా..

  • కాంగ్రెస్‌కు పోటీ చేసే అర్హత లేదు
  • బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించండి
  • 317 జివోకు వ్యతిరేకంగా పోరాడింది బీజేపీ
  • నిరుద్యోగుల పక్షాల ఉద్యమించాం
  • కమీషన్లు, కుట్రలు తప్ప కాంగ్రెస్ ఏం చేసింది
  • వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
  • కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్, ఆంధ్రప్రభ : ఉపాధ్యాయులు గ్రాడ్యుయేట్ల సమస్యల పరిష్కారం కోసం ఒక్క నాడైనా పోరాటం చేయని కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలియజేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో టీచర్, గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా బిజెపి సోషల్ మీడియా కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ… టీచర్లు, గ్రాడ్యుయేట్ల పక్షాన ఎన్నడైనా కాంగ్రెస్ నాయకులు పోరాటాలు చేశారా, 317 జీవోకు వ్యతిరేకంగా ఎన్నడైనా కేసీఆర్ సర్కార్ తో కొట్లాడారా అని ప్రశ్నించారు. గ్రూప్ 1 సహా నిరుద్యోగల పక్షాన ఎన్నడైనా జైలుకు వెళ్లారా అని ప్రశ్నించారు.

ఈనాడు పోరాటాలు చేయని కాంగ్రెస్ అభ్యర్థులకు ఎందుకు ఓట్లేయాలన్నారు. టీచర్లు, నిరుద్యోగుల సమస్యలపై నిరంతరం కొట్లాడింది, జైలుకు వెళ్లింది, లాఠీదెబ్బలు తిన్న చరిత్ర బీజేపీదే అని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడితే సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు అనేక మంది బీజేపీ కార్యకర్తలపై నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంతోపాటు నేటి కాంగ్రెస్ ప్రభుత్వం సైతం పలు కేసులు పెట్టి వేధించిందన్నారు.

అయినా వెనుకాడకుండా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో పనిచేస్తున్న కార్యకర్తలకు హ్యాట్సాఫ్ అని, ఎంతోమంది నాయకులు, కార్యకర్తలు బీజేపీ సిద్ధాంతాల కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టారన్నారు.

నిరుద్యోగుల సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేసిన చరిత్ర బీజేపీదే అన్నారు. వరంగల్, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో పోరాటాలు చేశామన్నారు. నల్లగొండ, సిద్దిపేటలో నిరుద్యోగుల పక్షాన పోరాడితే అనేక మంది కాళ్లు చేతులు విరగ్గొట్టారన్నారు.

గ్రూప్ 1 ఉద్యోగుల పక్షాన కేంద్ర మంత్రిగా ఉంటూ మద్దతు తెలిపి పోరాటం చేశానని, బీఆర్ఎస్ నేతలు ఆనాడు గ్రూప్ 1 నిరుద్యోగుల మధ్యకు చేరి విధ్వంసం స్రుష్టించాలని చూశారన్నారు. ఈరోజు కాంగ్రెస్ నేతలు ప్రతి పనికి సంబంధించి బిల్లులో 14 నుండి 18 శాతం కమీషన్ అడుగుతున్నారన్నారు.

కమీషన్ ఇవ్వకుంటే బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లను వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. ప్రతినెలా సక్రమంగా టీచర్లకు జీతాలు చెల్లించాలని బీజేపీ పోరాడిన ఫలితంగా నేడు అందరికీ జీతాలు వస్తున్నాయన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పక్షాన పోటీ చేస్తున్న గ్రాడ్యుయేట్ అభ్యర్తి ఏనాడైనా పోరాటమైనా చేశారా అని ప్రశ్నించారు.

కుల గుణన పేరుతో బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తూ, ముస్లింలను బీసీల్లో కలుపుతుంటే పోరాడుతున్నది కూడా బీజేపీయే అని, ఈ విషయాలన్నీ ప్రజలకు వివరించి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులకు ఓట్లేసి గెలిపించాలన్నారు. ఈ సమావేశంలో బిజెపి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాజీ ఎమ్మెల్సీ ప్రభాకర్, మాజీ మేయర్ సునీల్ రావు, బిజెపి జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి తో పాటు పెద్ద సంఖ్యలో సోషల్ మీడియా వారియర్స్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *