ఎరువుల సరఫరా, సమస్యలపై రైతుల సందేహాల నివృత్తి
(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) :
నమస్తే సార్.. అంటూ ఓ అన్నదాత నుంచి ఫోన్..
చెప్పండి.. మీ పేరు ఏమిటి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎలా ఉన్నారు?.. కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆత్మీయ పలకరింపు….
ఎరువుల సరఫరా, సమస్యలపై రైతుల సందేహాలను నివృత్తి చేసేందుకు శుక్రవారం ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ (Dial your collector) కార్యక్రమానికి రైతుల నుంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి జగ్గయ్యపేట, ఎ.కొండూరు, తిరువూరు, నందిగామ, గొల్లపూడి.. ఇలా వివిధ ప్రాంతాల నుంచి 45 ఫోన్ కాల్స్ వచ్చాయి. ప్రతి ఫోన్ కాల్‌ను స్వీకరించి.. రైతు చెప్పిన సమస్యను విని, ఆ సమస్యపై అక్కడే ఉన్న అధికారులను ఆరా తీసి, పరిష్కారానికి ఆదేశాలిచ్చారు.
ఎంత విస్తీర్ణంలో పంట వేశారు? ఇప్పటివరకు ఎన్ని కట్టలు తీసుకెళ్లారు? ఇప్పుడు ఎన్ని సంచులు కావాలి? క్షేత్రస్థాయిలో మీకు ఎదురైన ఇబ్బంది ఏమిటి? ఇంత వరకు సంబంధిత సొసైటీకి ఎంత సరఫరా చేశారు? ఈ రోజు ఎంత మొత్తం అందుబాటులో ఉంది.. ఇంకా ఎంత వస్తుంది.. ఇలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా వివరించారు. మోతాదుకు మించి వాడకుండా సూచనలు చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తల (agricultural scientists) సలహా ప్రకారం… వరి నాటు వేసినప్పుడు ఒకటో విడతగా ఎకరానికి 30 కిలోలు, నాటు వేసిన 30 రోజులకు రెండో విడతగా ఎకరానికి 30 కిలోలు, నాటు వేసిన 60 రోజులకు మూడో విడతగా ఎకరానికి 30 కిలోలు వేయొచ్చన్నారు.
రెండు, మూడో విడతల్లో అధిక దిగుబడులకు, పర్యావరణ పరిరక్షణకు (Environmental Protection), నేల సారాన్ని కాపాడుకునేందుకు నానో యూరియా (nano urea)ను ఉపయోగించాలని సూచించారు. అర లీటర్ నానో యూరియాను స్ప్రే చేస్తే ఒక సంచి యూరియాను వినియోగించినట్లని వివరించగా.. తప్పనిసరిగా నానో యూరియాను వినియోగిస్తామని, తోటి రైతులను కూడా నానో యూరియా ఉపయోగించేలా ప్రోత్సహిస్తామని కొందరు రైతులు (farmers) చెప్పారు. పంట విస్తీర్ణం, విడతల వారీగా అవసరమైన ఎరువులను పంపిణీ చేసే విషయంలో ఎక్కడా ఏ రైతుకూ ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం (State Government) చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వదంతులు నమ్మవద్దని, కలెక్టరేట్ (Collectorate)లో 91549 70454 నంబరుతో కమాండ్ కంట్రోల్ (Command Control) రూమ్ అందుబాటులో ఉందని.. రైతులు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, జిల్లా సహకార అధికారి డా. ఎస్.శ్రీనివాసరెడ్డి, మార్క్ ఫెడ్ అధికారి నాగ మల్లిక తదితరులు పాల్గొన్నారు.

