Dharmapuri | డంపింగ్ యార్డు తరలింపునకు చర్యలు

Dharmapuri | డంపింగ్ యార్డు తరలింపునకు చర్యలు
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
Dharmapuri | ధర్మపురి, ఆంధ్రప్రభ : ధర్మపురి పట్టణం లోని గోదావరి ఒడ్డున ఉన్న డంపింగ్ యార్డు తరలింపుకు చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర ఎస్సి, ఎస్టి, వికలాంగుల, ట్రాన్స్ జెండర్ సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) పేర్కొన్నారు. శనివారం డంపింగ్ యార్డు సమస్యను స్థానిక నాయకుల దృష్టికి తీసుకురావడంతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో పాటు, హైదరాబాద్ నుండి ప్రత్యేక రీసైక్లింగ్ నిపుణులను పిలిపించి డంపింగ్ యార్డు పరిస్థితిని పరిశీలించారు.
ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రస్తుతం ఉన్న డంపింగ్ యార్డు (Dumping yard) ను పూర్తిగా తరలించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆధునిక రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నియమావళి ముగిసిన వెంటనే శాఖాధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి, అమలు చర్యలను ఖరారు చేస్తామని స్పష్టం చేశారు.

రానున్న గోదావరి పుష్కరాల (Godavari Pushkaralu) ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని మంత్రి పేర్కొన్నారు. “పుష్కరాల ఏర్పాట్లు హడావిడిగా కాకుండా, ప్రత్యేక నిధులు కేటాయించి సమగ్రంగా పూర్తి చేస్తాం” అని తెలిపారు. అదేవిధంగా సేవరేజి ప్లాంట్ ఏర్పాటు పనులు కూడా ప్రగతి దశలో ఉన్నాయని చెప్పారు. డంపింగ్ యార్డు మార్పు, రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు కోసం ఎంత నిధులు అవసరమైనా ప్రభుత్వం వెనుకాడదని మంత్రి స్పష్టం చేశారు.
ధర్మపురిలో విద్యా, వైద్య రంగాలకు నూతన వసతులు…
స్థానిక అభివృద్ధిని వివరించిన మంత్రి, ధర్మపురి(Dharmapuri) లో డిగ్రీ కళాశాల మంజూరు కాగా, జూన్ నెల ఓనుంచి తరగతులు ప్రారంభం కానున్నాయని, అదేవిధంగా మండలంలో పోస్ట్ మార్టం యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు, నైట్ కళాశాల ప్రారంభానికి కూడా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అద్యక్షుడు సంఘనబట్ల దినేష్, అలయ చైర్మన్ జక్కు రవీందర్, పట్టణ కాంగ్రెస్ అద్యక్షుడు చిపిరిశెట్టి రాజేష్, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సింహారాజు ప్రసాద్, అప్పం తిరుపతి, బొంది లక్ష్మణ్ గ్రామ ప్రజలు, యువత తదితరులు పాల్గొన్నారు.
