పోటెత్తిన భక్తులు..
కరీంనగర్, ఆంధ్రప్రభ : కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని కరీంనగర్ లోని శ్రీ మహాశక్తి దేవాలయాని(Shri Mahashakti Temple)కి భక్తులు పోటెత్తారు. సత్యనారాయణ స్వామి వ్రతాలకు నేడు శ్రీ మహాశక్తి దేవాలయం ఒక తెలంగాణ అన్నవరంగా మారింది. దేవాలయంలో ప్రత్యేకంగా పూలతో అలంకరించిన మండపం వేయగా, అందులో సామూహికంగా శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతం కన్నుల పండుగగా జరిగింది.
శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామి(Sri Sri Vidyaranya Bharati Swami) వారి దివ్య ఆశీస్సులతో ఆలయ వేద పండితులు ఇట్టి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం శివ కేశవుల ఆరాధనకు ముఖ్యమైనది.
ఈ మాసంలో ప్రతి ఒక్కరూ చేసే పవిత్రమైన పూజ సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ వ్రతాన్నిఆచరించడం వల్ల, సత్యనారాయణ స్వామిని పూజించడంవల్ల ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, కష్టాలనుండి విముక్తి లభిస్తుందని, విశేషంగా కుటుంబ శ్రేయస్సు కలుగుతుందని, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా భార్యాభర్తలు(husband and wife) ఆనందంగా ఉండేందుకు ఈ సత్యనారాయణ స్వామి వారు కాపాడుతారని హిందువుల విశ్వాసం.
ఎవరైతే ఆలయాల్లో లేదా పవిత్ర స్థలాల్లో దీపాలను దానం చేస్తారో వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుందిని, ఈ దీపం మనలోని అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని తద్వారా మోక్ష ప్రాప్తికి దారి చూపుతుందని హిందువుల విశ్వాసం. ఈ సందర్భంగా అనేకమంది భక్తులు దేవాలయంలో దీప దానాలను అందించారు.

