అభివృద్ధి పథకాలే విజయ సోపానాలు

ఆలేరు,ఆంధ్రప్రభ : గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే మున్సిపల్ ఎన్నికల్లో విజయ సోపానాలుగా మారుతాయని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు, రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, రుణమాఫీ, రైతు బీమా అంటే ఎన్నెన్నో పథకాలు ప్రజలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అందించిందని చెప్పారు. నిరంతరం ప్రజల కోసం ఆలోచించి పని చేసే కాంగ్రెస్ ప్రభుత్వానికి మున్సిపల్ ఓటర్లు అండగా ఉంటారన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ, మహిళా నాయకులు బీజని బాలమణి, పాము అనిత, దీప తదితరులు పాల్గొన్నారు.
