55 కోట్లతో 109 చెరువుల అభివృద్ది..
విజయనగరం, (ఆంధ్ర ప్రభ ):
విజయనగరం ఇరిగేషన్ డివిజన్ పరిధిలోని 109 మైనర్ ఇరిగేషన్ చెరువులను సుమారు రూ.55 కోట్లతో అభివృద్ది చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. చిన్నతరహా నీటిపారుదల చెరువుల అభివృద్ది పై తమ ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు. ఆర్ఆర్ఆర్ (రిపేర్స్, రెస్టోరేషన్, రెన్నోవేషన్) క్రింద డివిజన్‌లో మొదటి విడత 44, రెండో విడత 49, తాజాగా మూడోవిడతలో 16 చెరువులను ప్రతిపాదించినట్లు తెలిపారు. మొత్తం ఐదు నియోజకవర్గాల్లోని 19 మండలాల్లో ఈ చెరువులను అభివృద్ది చేయనున్నట్లు చెప్పారు. ఈ 109 చెరువుల అభివృద్దికి అనుమతి రాగానే, పనులు ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ ఎస్ఈ పి.అప్పలనాయుడు, ఈఈ వెంకటరమణ, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత, డ్వామా పిడి శారదాదేవి, ఇతర ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.

