అభివృద్ధి, సంక్షేమం నా లక్ష్యం..

- సంక్షేమ పథకాలే ప్రధాన ఎజెండా
- బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థన
- బొట్టు పెట్టి ఓటు అడుగుతున్న సుమలత…
నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మేర్గు సుమలత శ్రీనివాస్ గౌడ్ నర్సంపేట రూరల్ మండలం ఇటుకాలపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ మహిళలకు బొట్టు పెట్టి…. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి సర్పంచ్‌గా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామస్తులను కోరుతున్నారు. ఈ ప్రచారానికి ఇటుకాలపల్లి గ్రామస్తులు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు.
ఈ సందర్భంగా సుమలత శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా, ఎలాంటి పక్షపాతం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ నిష్పక్షపాతంగా అందిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రెండు సంవత్సరాల ప్రజాపరిపాలనలో ప్రతి గ్రామానికి సంక్షేమ పథకాలు అందజేసిందని తెలిపారు.
ముఖ్యంగా గృహజ్యోతి పథకం ద్వారా ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎంతో లాభం పొందుతోందన్నారు. అలాగే ఆసరా పింఛన్లు, వితంతు పింఛన్లు, వృద్ధాప్య, వికలాంగుల పింఛన్లు, రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాల వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో గ్రామాల్లో అర్హులైన కొంతమందికి ఈ పథకాలు అందలేదని ఆమె విమర్శించారు. నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఆశీస్సులతో ఇటుకాలపల్లి గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.
గ్రామంలో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీ కాలువలు, సోలార్ పవర్ వీధి దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు వివిధ అభివృద్ధి పనులు చేపట్టి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. నర్సంపేట నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన బహిరంగ సభ వల్ల కాంగ్రెస్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో చేసిన వాగ్దానాలను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో ఇటుకాలపల్లి గ్రామ ప్రజలకు అందించేందుకు తనను సర్పంచ్‌గా అత్యధిక మెజారిటీతో గెలిపించి గ్రామ సేవ చేసే అవకాశం ఇవ్వాలని ఆమె గ్రామస్తులను వేడుకున్నారు.
