దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్

దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్

  • మెయిన్ రోడ్డు పై గంట పాటు బంధువులు, గ్రామస్తుల రాస్తారోకో
  • సీఐ ,పోలీసులతో బాధితురాలి బంధువుల వాగ్వివాదం
  • పోలీసుల నిర్లక్ష్యం పై నిరసనలు…
  • లంచం తీసుకున్నారని ఆరోపణలు..

మోత్కూర్, ఆంధ్రప్రభ : ఆస్తి కోసం వదిన గొంతు కోసిన ఘటనలో మరిది బొంత అశోక్ తో పాటు మేనల్లులు ముగ్గురిని తక్షణమే అరెస్ట్ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం పాలడుగు మెయిన్ రోడ్డు 930 పి హైవే పై సుమారు గంటకు పైగా బాధితురాలు బొంత వెంకటమ్మ కి న్యాయం చేయాలంటూ బంధువులు ,గ్రామస్తులు పెద్దఎత్తున రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.

సంఘటన జరిగిన సుమారు గంట దాటినప్పటికి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, రూ.10 లక్షలు పోలీసులు లంచం తీసుకొని దోషులను అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. అక్కడికి చేరుకున్న సి ఐ వెంకటేశ్వర్లు, ఎస్ ఐ సతీష్ లతో బాధితురాలి బంధువులు వాగ్వివాదానికి దిగి పోలీసుల నిర్లక్ష్యం పై తీవ్ర స్థాయిలో విమర్శించారు. తక్షణమే దోషులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

గత 3 నెలల క్రితం బాధితురాలు వెంకటమ్మ ఇంటిపై దాడి చేసి డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లగా,పోలీసు స్టేషన్లో వెంకటమ్మ ఫిర్యాదు చేసినప్పటికీ స్థానిక ఓ రాజకీయ నాయకుని అండదండలతో సదరు కేసు ని పోలీసులు నీరుగార్చారని..అప్పుడే పోలీసులు స్పందించి ఉంటే హత్యాయత్నం జరిగి ఉండేది కాదని,తమ కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు దోషులకు కొమ్ము కాస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు బహిరంగంగా చేయడంతో పలువురు పోలీసుల పనితీరును, ఆ శాఖ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు స్థానిక సర్పంచ్ అంతటి భగవంతు,బంధువులకు సి ఐ వెంకటేశ్వర్లు బాధితురాలికి న్యాయం చేస్తామని,దోషులను శిక్ష పడేలా చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. సుమారు గంటకు పైగా రాస్తారోకో కొనసాగడంతో హైవే పై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

Leave a Reply