Demand | స‌న్ ఫ్ల‌వ‌ర్ కు మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించండి – హ‌రీశ్ రావు

సిద్ధిపేట‌,ఆంధ్ర‌ప్ర‌భ – సన్‌ఫ్లవర్ పంటకు తగిన మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే ప్రత్యేక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతులకు గిట్టుబాటు ధర అందించాలన్నారు. రైతుల అవగాహన కోసం పంట వివరాలను ఆన్లైన్‌లో పొందుపరిచి, మార్కెట్ పరిస్థితుల గురించి ముందస్తు సమాచారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం సలేంద్రి గ్రామంలో రంగనాయక సాగర్ కాలువను నేడు ఆయ‌న పరిశీలించారు. కాలువలో ప్రవహిస్తున్న గోదావరి జలాలను చూసి సంతోషించారు. రైతులకు సాగునీరు అందడంపై హర్షం వ్యక్తం చేస్తూ, కాలువ పక్కన ఆగి సెల్ఫీ దిగారు. అనంతరం స్థానిక రైతులతో ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.


అనంతరం మెట్టుపల్లి గ్రామంలోని పొద్దుతిరుగుడు (సన్‌ఫ్లవర్) తోటలను సందర్శించి, అక్కడి రైతులతో ముఖాముఖి చర్చించారు. రైతులు మార్కెటింగ్ సమస్యలను, పంటకు సరైన ధర లేకపోవడం వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించగా, తక్షణమే ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.


సాగునీరు అందించేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించడం వల్లే ఇప్పుడు పంట పొలాలకు గోదావరి జలాలు అందుతున్నాయని చెప్పారు. నిత్యం నీటి కొరతతో తిప్పలు పడే ఈ ప్రాంతాలు సాగునీటి సౌకర్యంతో పచ్చగా మారాయని, ఇది కెసిఆర్ దూరదృష్టితోనే సాధ్యమైందని హరీష్ రావు గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హరీష్ రావు విమర్శించారు. రైతుల కోసం నిరంతర పోరాటం కొనసాగిస్తామని, రైతుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *