న్యూ ఢిల్లీ – తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేటి ఉదయం హస్తినాకు వెళ్లారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్రం పంపిన బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందేలా అన్ని పార్టీల మద్దతు కూడగట్టడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఈ టూర్ లో భాగంగా కలవనున్నారు.
కాంగ్రెస్ పార్టీ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో సీఎం భేటీ కానున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన, బీసీలకు రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ జాతీయ కార్యాలయంలో ఆ పార్టీ ఎంపీలకు ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి బీసీ రిజర్వేషన్ల బిల్లుపై లోక్ సభ, రాజ్యసభలో ఒత్తిడి చేయాలని కోరనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అధికారుల బృందంతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీని కలిసి బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం.