న్యూ ఢిల్లీ: తెలంగాణ నేతలు ఢిల్లీలో బిజీ షెడ్యూల్‌తో దూసుకెళ్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మరోవైపున భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఢిల్లీ చేరుకున్నారు. ఇద్దరి పర్యటనలు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కీలకంగా మారాయి.
రేవంత్ షెడ్యూల్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం 10:30 గంటలకు ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీలతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణలో నిర్వహించిన కులగణన, అలాగే బీసీ రిజర్వేషన్ల బిల్లుపై అధిష్టానంతో చర్చించనున్నారు. సాయంత్రం, ఎఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
ఇందులో తెలంగాణ కులగణన సర్వే ఎలా జరిగింది, ఎన్ని మంది ఉద్యోగులు పాల్గొన్నారు, ఏవిధమైన ప్రశ్నలు అడిగారు వంటి అంశాలపై కాంగ్రెస్ ఎంపీలకు పూర్తి వివరాలు ఇవ్వనున్నారు.
అమిత్ షా తో తెలంగాణ చీఫ్…
ఇక మరోవైపు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గోల్లపల్లి రామచంద్రరావు ఢిల్లీలో పర్యటన చేపట్టారు. ఆయన ఈ రోజు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, ముఖ్యంగా ఇటీవల బీజేపీలో బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య వచ్చిన విభేదాల నేపథ్యం గురించి చర్చించనున్నట్లు సమాచారం. అలాగే రాష్ట్రంలో బీజేపీ బలపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలు, విభాగాల్లో తలెత్తిన అసంతృప్తి నివారణ, భవిష్యత్ కార్యాచరణపై అమిత్ షాకు రిపోర్ట్ ఇవ్వనున్నారని సమాచారం.