MBNR | ధాన్యం కొనుగోలులో జాప్యం.. రైతుల ఆందోళ‌న‌

వనపర్తి ప్రతినిధి, మే 13(ఆంధ్రప్రభ) : ఊరూరా దొడ్డు వడ్ల ధాన్యం కొనుగోలు ప్రహసనంగా మారింది. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం, నిర్వాహకుల అలసత్వం.. ఫలితంగా అన్నదాతలు అరిగోస పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు వడ్లు పోసి వారాలకొద్దీ వేచి చూసినా కాంటాలు కావడం లేదు. ఈ సమయంలో అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవుతున్నది. కొన్నిచోట్ల వరదలకు కొట్టుకుపోతున్నది. ఈ నేపథ్యంలో కాంటాలు పెట్టాలని ధాన్యం రైతులు నిత్యం కేంద్రాల్లో గగ్గోలు పెడుతున్నారు. ఇదే దశలో కాంటాలు పెట్టడంలేదని ఆగ్రహిస్తూ మంగళవారం ఆత్మకూర్ మండలం ఆరెపల్లి అన్నదాతలు వనపర్తి సమీకృత కలెక్టర్ లోని జిల్లా పౌర సరఫరాల కార్యాలయం వద్ద ఆందోళనలు నిర్వహించారు.

ఆత్మకూరు మండలం ఆరెపల్లి కొనుగోలు కేంద్రంలో కాంటాలు ఎందుకు పెట్టడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రాలకు దొడ్డు వడ్లు తెచ్చి రోజులు గడిచినా కాంటాలు ఎందుకు పెట్టడం లేదంటూ కార్యాలయ సిబ్బందిని రైతులు నిలదీశారు. ఎప్పుడు వర్షం వస్తుందోనని భయంగా ఉన్నదని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పక్షపాతంతో దొడ్డు వడ్ల ధాన్యం కాంటాలు పెట్టడం లేదని ఆరోపించారు. కొనుగోలు కేంద్రంలో నెల రోజులైనా ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని పలువురు రైతులు ఆరోపించారు. కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతున్నదని, వర్షానికి ధాన్యం తడిసిపోతున్నదని, కొన్నవాటికి లారీలు రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. ఉన్నతాధికారులు వచ్చి హామీ ఇచ్చేవరకు ఆందోళనను విరమించేదిలేదని పట్టుబట్టారు. దీనిపై సివిల్ సప్లై అసిస్టెంట్ డీఎం.బాలు నాయక్ ను వివరణ కోరగా… ఆరెపల్లి గ్రామానికి 5లారీలు పంపడం జరిగిందని తెలిపారు.

Leave a Reply