విద్యార్థులు ఆరోగ్యం, విద్యపై శ్రద్ధ వహించాలి

విద్యార్థులు ఆరోగ్యం, విద్యపై శ్రద్ధ వహించాలి
- వైద్య శిబిరంలో అగ్నిమాపక అధికారి బి.నాగేశ్వర్రావు
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : విద్యార్థులు ఆరోగ్యంతోపాటు విద్యపై శ్రద్ధ వహించాలని జిల్లా అగ్నిమాపక అధికారి బి.నాగేశ్వర్రావు అన్నారు. పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదుగాలని ఆయన సూచించారు. సంగారెడ్డి పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాలలో మహేశ్వర హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం మంగళవారం మార్కెటింగ్ మేనేజర్ వెంకట్ గౌడ్ సమన్వయంతో నిర్వహించారు. దాదాపు 150 మంది విద్యార్థులకు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశామని వెంకట్‌గౌడ్ తెలిపారు.
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా మహేశ్వర మెడికల్ హాస్పిటల్ తరచూ ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఈ శిబిరంలో మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అరుణబాయి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మహేశ్వర మెడికల్ కళాశాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
