తెల్లారిన 21 మంది బతుకులు
చేవెళ్ల, ఆంధ్రప్రభ : మృత్యువు ఏ రూపంలో దూసుకు వస్తుందో తెలియదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కర్నూల్ జిల్లాలో జరిగిన దుర్ఘటన మరువకముందే వికారాబాద్ జిల్లా (Vikarabad District) చేవెళ్లలో ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంతో తెలంగాణ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పది రో్జుల తిరగకముందే తెలుగు రాష్ట్రాల్లో మరో ఘోరమైన ప్రమాదం జరిగింది. కర్నూల్ జిల్లాలో బస్సు దగ్ధమై 21 మంది సజీవదహనమయ్యారు. ఈ దుర్ఘటన ఈ నెల 24వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం రోడ్డు వికారాబాద్ జిల్లా చేవెళ్ల మండలం మీర్జాపూర్ వద్ద జరిగిన దుర్ఘటనలో 21 మంది దుర్మరణం పాలయ్యారు. టిప్పర్ రూపంలో దూసుకు వచ్చిన మృత్యువుతో 19 మంది బతుకులు తెల్లారిపోయాయి.
ఇంకా సూర్యుడు అప్పుడప్పుడే ఉదయిస్తున్నాడు. తెల్లవారు జామున (At dawn) బస్సు ఎక్కిన వారికి అదే ఆఖరి ప్రయాణం అని కూడా తెలియదు. బస్సు కిటకిటలాడుతోంది. సీట్లు దొరికినవారు కూర్చున్నారు. మిగిలిన వారు నిలబడి ఉన్నారు. బస్సు బయలుదేరిన రెండు తర్వాత ఒక్కసారిగా కుదుపు వచ్చింది. ఏదో ప్రమాదం ముంచుకొస్తుందని అనుకునేలోపల కంకర మీద పడింది. అంతే కంకరలో చిక్కుకున్న వారు అలానే ప్రాణాలు వీడిచారు. ఇక గాయపడినవారు కూడా కొందరు మృత్యువు ఒడిలోకి వెళ్లిపోయారు. అయితే బస్సులో ఉన్న వారు పరుగుపరుగున కిందకు దిగేటప్పుడు జరిగిన తోపులాటలో కూడా కొందరు గాయపడ్డారు.
ప్రమాదం జరిగిందిలా..
తాండూరు నుంచి హైదరాబాద్ (Tandur to Hyderabad) కు తెల్లవారు జామున ఐదు గంటలకు బస్సు బయలు దేరింది. వికారాబాద్, చేవెళ్ల మీదుగా బస్సు ఉదయం 6.45 గంటలకు బస్సు మీర్జాపూర్ వద్దకు చేరుకుంది. అదే సమయంలో స్పీడ్‌గా వచ్చిన కంకర లోడుతో ఉన్న టిప్పర్ అదుపు తప్పి బస్సును ఢీకొంది. క్షణాల్లో కంకర బస్సులో ఉన్న ప్రయాణికులపై పడింది. దీంతో ఊపిరి ఆడక చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయానికి 72 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో 21 మంది మృత్యువాత పడ్డారు. సుమారు 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రితోపాటు పట్నం మహేంద్రరెడ్డి మెడికల్ కళాశాల ఆస్పత్రిలో 17 మందికి చేర్పించారు. గాయపడిన వారికి అత్యవసర చికిత్సలు చేస్తున్నారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. బస్సులో కుడిమ వైపు టిప్పర్ దూసుకు రావడం వల్ల మహిళలకు కేటాయించిన సీట్లు అటు వైపు ఉండడం వల్ల ఎక్కువ మంది మహిళలు మృత్యువాత పడ్డారు.
ప్రమాదంపై పలు అనుమానాలు..
తెలంగాణలో హైదరాబాద్-బీజాపూర్ (Hyderabad-Bijapur) జాతీయ రహదారిలో ప్రయాణమంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాలి. ఎప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో, ఏ దుర్వార్త వినాల్సి ఉంటుందో అనేది ఇక్కడ ప్రజలు అంటున్నారు. నాలుగేళ్లుగా ఈ రోడ్డు విస్తరణ కాకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారింది. ట్రిప్పర్లు కూడా అతి వేగంగా వెళుతుంటాయి. వాటికి కారణం లేకపోలేదు. వాళ్లకు ట్రిప్పులు లెక్కల మీద కిరాయి ఇవ్వడం వల్ల ట్రిప్పులు ఎక్కువగా వేయాలన్నా ఆలోచనతో అతివేగంగా వెళుతుంటారు. ప్రమాదాలకు ఇవే కారణాలు. ఈ రోజు జరిగిన ప్రమాదంలో కూడా టిప్పర్ అతివేగంగా వెళుతూ అదుపు తప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. మరో కారణం లేకపోలేదు. జాతీయ రహదారులపై కంకార, ఇసుక తదితర సామగ్రి నడిపినప్పుడు టార్పాలిన్లు కప్పలన్నా నిబంధనలు ఉన్నాయి. వాటిని టిప్పర్ డ్రైవర్లు పట్టించుకోవడం లేదు. టార్పాలిన్ లేకపోవడం వల్లే ఒక్కసారిగా కంకార పడిపోయి మృతుల సంఖ్య పెరగడానికి ఒక కారణమైంది. ఒక వైపు ప్రభుత్వం, మరోవైపు మానవ తప్పిదం వల్లే ఇంతటి ఘోరం జరిగింది.
ఉలిక్కిపడిన తాండూరు..
బస్సు ప్రమాదంలో 21 మంది దుర్మరణం పాలైతే.. మృతుల్లో తాండూరు నుంచి బయలుదేరిన బస్సు ప్రమాదానికి గురైందని తెలియడంతో తాండూరు పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అక్కడ నుంచి అరవై కిలో మీటర్ల దూరంలో ఉన్న ప్రమాద ఘటనకు పట్టణ వాసులు పరుగులు తీశారు. సంఘటన స్థలంలో ఉన్న విగత జీవులను చూసి ఆయా కుటుంబ సభ్యలు రోదనలు మిన్నంటాయి. దీంతో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని గాంధీనగర్ కు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కుమార్తెలు ఈ ప్రమాదంలో మృతిచెందారు. అక్కాచెల్లెళ్లు తనూష, సాయి ప్రియ. నందిని మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. హైదరాబాద్ లోని కోఠి మహిళా కళాశాలలో ముగ్గురు చదువుతున్నారు. గత నెల 15న జరిగిన ఓ పెళ్లివేడుకలో సందడిగా గడిపారు. ముగ్గురు అక్కాచెలెళ్లు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనాస్థలికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఎల్లయ్యగౌడ్ డ్రైవర్‌గా పనిచేస్తూ పిల్లలను చదివించారు. ఆయనకు నలుగురు కుమార్తెలు. ఒక కుమార్తెకు వివాహం కాగా, మిగిలిన ముగ్గురు కుమార్తెలు ప్రమాదంలో విగత జీవులుగా మారడంతో ఆ కుటుంబం, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

