Dead | తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి..

Dead | ఢిల్లీ, ఆంధ్ర్రప్రభ : హర్యానా రాష్ట్రంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కురుక్షేత్ర (నిట్ కురుక్షేత్ర)లో తెలంగాణకు చెందిన విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం గ్రామానికి చెందిన అంగోత్ శివ నిట్ కురుక్షేత్రలో కంప్యూటర్ సైన్స్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం.. శివ హాస్టల్ గదిలో ఉరి వేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం హాస్టల్ గదికి వెళ్లిన అనంతరం భోజనానికి రాకపోవడంతో అనుమానం చెందిన తోటి విద్యార్థులు గదికి వెళ్లి చూడగా.. ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న స్థితిలో కనిపించినట్లు సమాచారం.
అయితే.. శివ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సరైన సమాచారం ఇవ్వకుండా కళాశాల యాజమాన్యం వ్యవహరించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. శివ మృతదేహాన్ని నిట్ సివిల్ హాస్పిటల్‌కు తరలించినట్లు సమాచారం. కాగా.. కళాశాల ముందు తల్లిదండ్రులు పడిగాపులు కాచారు. హాస్పిటల్లోకి కూడా అనుమతించలేదని వారు ఆరోపించారు. నిట్ కురుక్షేత్ర యాజమాన్యం తీరు పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
