Cyclone Ditva | ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

- ఈనెల 29, 30, డిసెంబర్ 1 తేదీలలో భారీ వర్షాలు
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: బంగాళాఖాతంలో ఏర్పడిన “దిత్వా” వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ముఖ్యంగా నంద్యాల జిల్లాలో ఈ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా శుక్రవారం తెలిపారు. శనివారం, ఆదివారం, సోమవారం… మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.
మొక్కజొన్న, వరి పంటల కోత పనులను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని, ఇప్పటికే కోసిన పంటలకు తార్పాలిన్ షీట్లు వేసి రక్షణ కల్పించాలని సూచించారు. తేమకు గురికాకుండా పంటను నిరంతరం పర్యవేక్షించాలని, ఆరుబయట ఉంచకుండా తప్పనిసరిగా గోడౌన్లు లేదా భద్రమైన గదుల్లో నిల్వ చేయాలని కలెక్టర్ అన్నారు.
వర్షాల సమయంలో విద్యుత్ తీగలు, చెట్లు, నీటితో నిండిన రహదారుల వద్ద జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే గ్రామ వాలంటీర్లు, సంబంధిత తహసీల్దార్ లేదా వ్యవసాయ అధికారులను సంప్రదించవచ్చన్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా సహాయం అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ తెలిపారు.
