AP | విపరీతంగా పెరుగుతున్న సైబర్‌ నేరాలు : హోంమంత్రి అనిత

అమరావతి : సైబర్‌ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్‌ హోంశాఖ మంత్రి అనిత ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారులపై అత్యాచారాలు దురదృష్టకరమన్నారు. విజయవాడలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొని ప్రసంగించారు. న్యాయవాదులందరినీ ఒకే చోట చేర్చి సదస్సు నిర్వహించడం సంతోషకరమన్నారు. న్యాయవ్యవస్థలో మహిళలు ఎక్కువగా ఉండటం శుభపరిణామమన్నారు. సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయని అన్నారు.

దొంగలు చాలా తెలివి మీరిపోయారని చెప్పారు. ప్రతి వ్యక్తి తనకు తాను నిఘా పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు చాలా అవసరమన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని నేరాలను నియంత్రించాలని సూచించారు. ఆన్‌లైన్‌ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పోలీసు, న్యాయవ్యవస్థ సమన్వయంతో చాలా కేసులు ఛేదించొచ్చన్నారు. బాధితులకు అండగా నిలిచేందుకు మనమంతా ఏకమవుదామ‌ని పిలుపునిచ్చారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుదామ‌ని హోంమంత్రి అనిత పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *