ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

- ఆదివారం భక్తులతో కిక్కిరిసిన ఆలయం..
- కిటకిటిలాడిన అన్ని క్యూ లైన్లు..
- సామాన్య భక్తులకు పెద్దపేట..
- నిరంతరాయంగా అమ్మవారి దర్శనం..
ఆంధ్రప్రభ విజయవాడ : ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రాచుర్యం పొందిన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆదివారం భక్తుల సందడి ఎక్కువగా ఉంది. వారాంతపు సెలవులు రావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్దఎత్తుల భక్తులు తరలిరావడంతో ఇంద్రకీలాద్రి కిక్కిరిసింది.
ఆదివారం ఉదయం నుండి క్రమక్రమంగా భక్తుల రాక పెరిగిన నేపథ్యంలో ఉచిత, 100,300,500 క్యూలైన్లన్నీ భక్తులతో రద్దీగా కనిపించాయి. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు విస్తృత ఏర్పాటు చేసి సామాన్య భక్తులకే పెద్ద పీట వేసేలా చర్యలు చేపట్టారు. సామాన్య భక్తులకే పెద్దపేట వేయడంతో నిరంతరాయంగా అమ్మవారి దర్శనం అంతరాలయ దర్శన ఏర్పాట్లు సఫలీకృతమయ్యాయి.
ఇంద్రకీలాద్రిపై ఈవో తనిఖీలు…
ఆదివారం ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కార్యనిర్వాహణాధికారి శీనా నాయక్ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వివిధ ప్రాంతాలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఘాట్ రోడ్డు మొదలు ఓమ్ టర్నింగ్,ఆన్లైన్ ప్రత్యేక సేవా కేంద్రం, ప్రోటోకాల్ ఆఫీస్, ప్రత్యేక క్యూ లైన్లు, ప్రధానాలయం వంటి ప్రతి ప్రదేశాలలో పర్యటించిన ఈఓ భక్తుల రద్దీ నీ క్రమబద్ధీకరించేందుకు అధికారులకు అవసరమైన సూచనలు సలహాలు ఇచ్చారు. ప్రత్యేకంగా భక్తులతో మాట్లాడి దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
