Crime | అమ్మానాన్నను నరికేశాడు – అల్లూరి ఏజెన్సీలో హత్యల కలకలం

మారేడుమిల్లి (ఆంధ్రప్రభ) రోజువారీ ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదనే అక్కసుతో అమ్మానాన్నను అతి కిరాతకంగా ఓ కొడుకు గొడ్డలితో నరికి చంపిన ఘటన సభ్య సమాజాన్ని కలవరపెట్టింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం చౌడకోట పంచాయతీ పరిధిలోని తుర్రవాడ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.

వివరాలు ఇలా ఉన్నాయి. అందాల సన్యాసిరెడ్డి (56), అందాల బోడమ్మ (53 ) గిరిజన దంపతులు కొండపోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఊరికి దూరంగా ఉన్న తుర్రం కొండ చేను వద్ద నివాసం ఏర్పాటు చేసుకొన్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. రోజువారి జీవనశైలిలో భాగంగా కొండపోడు వ్యవసాయం ముగించుకుని చేనుపాక వద్ద ఉండగా కొడుకు అందాల మల్లి రెడ్డి తన అవసరాలు నిమిత్తం డబ్బులు ఇవ్వడం లేదని శుక్రవారం సాయంత్రం తగాదా పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు అందాల సన్యాసిరెడ్డి (56), అందాల బోడమ్మ (53)లను మల్లి రెడ్డి అర్ధరాత్రి అతి కిరాతకంగా గొడ్డలితో నరికివేశాడు. అమ్మానాన్న ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.

తెల్లవారుజామున తుర్రవాడ గ్రామస్తులకు ఈ విషయం తెలిసింది. ఘటనా స్థలికి చేరుకున్నారు. మల్లి రెడ్డి గత కొన్నాళ్లుగా మతిస్థిమితం లేక తిరుగుతున్నాడని గ్రామస్తులు తెలిపారు. మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. మారేడుమిల్లి ఎస్ఐ శ్రీనివాస్ రావు కేసు దర్యాప్తు ప్రారంభించారు.

Read Also This :

Leave a Reply