Covid | మళ్లీ పెరుగుతున్న కొవిడ్ కేసులు.. 24 గంట‌ల్లో నలుగురు మృతి !

దేశవ్యాప్తంగా మళ్లీ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. తాజా అధికారిక సమాచారం ప్రకారం, ప్రస్తుతం భారత్‌లో 3395 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి. ఇందులో 1435 మంది తాజాగా కోలుకున్నట్లు సమాచారం. కొన్ని రాష్ట్రాల్లో కేసులు భారీగా నమోదు అవుతుండగా, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం తక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రాల వారీగా చూస్తే..

కేరళలో అత్యధికంగా 1336 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో 467, ఢిల్లీలో 375, కర్ణాటకలో 234, తమిళనాడులో 185, గుజరాత్లో 265, పశ్చిమ బెంగాల్‌లో 205 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో 17, తెలంగాణలో 3, ఒడిశాలో 7, రాజస్థాన్‌లో 60, పుదుచ్చేరిలో 41 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొన్నిచోట్ల మాత్రం పరిస్థితి మెరుగ్గానే ఉంది – ఉదాహరణకు సిక్కింలో ఒక్క యాక్టివ్ కేసు కూడా లేదు.

24 గంటల్లో నాలుగు మ‌ర‌ణాలు

అయితే, గత 24 గంటల్లో దేశంలో నలుగురు కోవిడ్ వల్ల మృతిచెందారు. వీరిలో ఢిల్లీకి చెందిన 71 ఏళ్ల వ్య‌క్తి న్యూమోనియా, సెప్టిక్ షాక్, మూత్ర సంబంధిత సమస్యలతో మరణించగా, కర్ణాటకలో 63 ఏళ్ల వ్యక్తి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ కారణంగా మరణించారు. కేరళలో 59 ఏళ్ల వ్యక్తి గుండె సమస్యలు, శ్వాసకోశ వైఫల్యం, డయాబెటిస్‌తో బాధపడుతూ చనిపోగా, ఉత్తరప్రదేశ్‌లోని 23 ఏళ్ల యువకుడు రిషికేశ్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

ఈ ఏడాది ఇప్ప‌టిక‌ర‌కు 26 మంది మృతి !

ఇక ఈ ఏడాది 2025 జనవరి 1 నుండి ఇప్పటివరకు… దేశవ్యాప్తంగా కోవిడ్ వల్ల మరణించినవారి మొత్తం సంఖ్య 26గా న‌మోదైంది ఇందులో కేరళలో 6, మహారాష్ట్రలో 7, కర్ణాటకలో 3, ఢిల్లీలో 3, ఉత్తరప్రదేశ్‌లో 2 మంది మృతి చెందారు. గుజరాత్, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కొక్కరు మరణించారు.

అప్రమత్తంగా ఉండాలి..

ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మాస్క్ ధరించడం, హ్యాండ్ శానిటైజర్ వినియోగించడం, జనసమ్మేళనాల్లో సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు వైద్య సలహా తీసుకోవడం చాలా ముఖ్యం అని అధికారులు చెబుతున్నారు.

Leave a Reply