హెల్మెట్ ధారణతోనే ప్రాణ రక్షణ

హెల్మెట్ ధారణతోనే ప్రాణ రక్షణ
ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రహ్మణ్యం
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : హెల్మెట్ ధారణతోనే ద్విచక్ర వాహన చోదకులకు ప్రాణ రక్షణ అని ఇబ్రహీంపట్నం సీఐ ఎ.సుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక రింగ్ సెంటర్ లో ఆదివారం రోడ్డు భద్రత, హెల్మెట్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ద్విచక్ర వాహన చోదకులను నిలిపి హెల్మెట్ వినియోగం ఆవశ్యకతను వివరించారు. వేగ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనలు, డ్రైవింగ్ సమయంలో మొబైల్ వినియోగం నివారణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహన చోదకులకు కౌన్సెలింగ్ ఇచ్చి, చిన్నపాటి నిర్లక్ష్యం ప్రాణ నష్టానికి దారితీస్తుందని హెచ్చరించారు.
ప్రతిఒక్కరూ తమ భద్రతతో పాటు ఇతరుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకుని వాహనాలు నడపాలని సూచించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించిన వాహనదారులకు అక్కడికక్కడే జరిమానా విధించకుండా హెల్మెట్ కొనుగోలు చేయించి, ధరింపజేసి పంపారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఆర్ఎస్సై బి.లక్ష్మణరావు, ఎస్సై రవివర్మ, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. అంతకుముందు పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. పవిత్ర సంగమం లో యువతకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించారు.
