ప్రచారంలో దూసుకుపోతున్న బండి ప్రవీణ్ కుమార్

నర్సంపేట, ఆంధ్రప్రభ ; నర్సంపేట మున్సిపాలిటీ 30వ వార్డులో కౌన్సిలర్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, అభ్యర్థి బండి ప్రవీణ్ కుమార్ చేపడుతున్న ప్రచారం ప్రజల్లో విశేష స్పందన పొందుతోంది. వార్డు అభివృద్ధే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్న ఆయన, స్థానికుల విశ్వాసాన్ని సంపాదించుకుంటున్నారు. తాగునీటి కొరత, డ్రైనేజీ సమస్యలు, అంతర్గత రహదారుల దుస్థితి, వీధి దీపాల నిర్వహణ వంటి ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు ఆయన తెలిపారు.
ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే కౌన్సిలర్‌గా పనిచేస్తానని హామీ ఇస్తున్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పన, మహిళలకు భద్రత, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపడం తన ప్రాధాన్యతలని బండి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. “వార్డు అభివృద్ధి రాజకీయాలకు అతీతం. ప్రజల అవసరాలే నా ప్రణాళికకు ఆధారం” అని ఆయన ప్రచారంలో స్పష్టం చేస్తున్నారు. స్థానికులు మాట్లాడుతూ, “మాటలకే పరిమితం కాకుండా పని చేసే నాయకుడు కావాలి. ప్రవీణ్ కుమార్ ప్రజలతో నేరుగా మమేకమవుతూ సమస్యలను అర్థం చేసుకుంటున్నారు” అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో 30వ వార్డులో ఈసారి ఎన్నికల్లో ఆయనకు ప్రజల మద్దతు బలంగా ఉన్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అభివృద్ధి, పారదర్శక పాలనకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్న బండి ప్రవీణ్ కుమార్ ప్రచారం, 30వ వార్డులో మార్పుకు నాంది పలుకుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
