వైరా మున్సిపాలిటీకి ‘చికిత్స’ అవసరం

వైరా మున్సిపాలిటీకి ‘చికిత్స’ అవసరం
- కౌన్సిలర్ చిలకా చిన్న కోటయ్య
- తొలి సాధారణ సమావేశంలో అభిప్రాయం
వైరా, ఆంధ్రప్రభ : నూతనంగా వైరా మున్సిపాలిటీ తొలి మహిళా చైర్‌పర్సన్‌గా ఎన్నికైన డాక్టర్ కాపా చంద్రకళ, సమస్యలతో బ్రష్టుపట్టిన మున్సిపాలిటీకి సమగ్ర ‘చికిత్స’ చేయాలని 8వ వార్డు కౌన్సిలర్ చిలకా చిన్న కోటయ్య పేర్కొన్నారు.
శనివారం నిర్వహించిన పురపాలక సంఘం తొలి సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్య వృత్తిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన డాక్టర్ చంద్రకళ, అదే ప్రతిష్ఠను నిలబెట్టుకుంటూ వచ్చే ఐదేళ్లలో వైరాను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.
20 వార్డుల కౌన్సిలర్ల సమిష్టి ఆలోచనలతో అన్ని ప్రాంతాల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, వైరా ఎమ్మెల్యే నాయకత్వంలో సుపరిపాలన అందించాలని సూచించారు.
మాస్టర్ ప్లాన్ లేకుండా నిర్మించిన డ్రైనేజీల కారణంగా అవి మురికి కాల్వలుగా మారాయని విమర్శించారు. గంధం టవర్స్ సమీపంలో నిర్మించిన డ్రైనేజీకి వర్షపు నీరు ఎటు మళ్లించాలనే విషయంలో స్పష్టత లేక ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ చంద్రకళ, వైస్ చైర్మన్ కట్ల సంతోష్, ఎమ్మెల్యే నాయకత్వంలో వైరాను మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని కోరారు.
