వైభవంగా ఇంద్రకీలాద్రిపై శ్రీరామ పట్టాభిషేకం..

వైభవంగా ఇంద్రకీలాద్రిపై శ్రీరామ పట్టాభిషేకం..
శ్రీరామనవమి ఉత్సవాల్లో నేత్రపర్వంగా మహోత్సవం
పాలకమండలి సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహణ..
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా రెండవ రోజు నేత్రపర్వంగా పట్టాభిషేకం వైభవంగా కొనసాగింది.
శనివారం ఉదయం 11 గంటలకు మహా మండపం ఏడవ అంతస్తులోని ధర్మపదం వద్ద శ్రీరాములవారి పట్టాభిషేక మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో శీనా నాయక్, చైర్మన్ బొర్రా గాంధీతో పాటు పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై శ్రీరాములవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

