Gram Panchayat | గ్రామాల అభివృద్ధికి స‌హ‌క‌రించండి

Gram Panchayat | గ్రామాల అభివృద్ధికి స‌హ‌క‌రించండి

ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
దాతల సాయంతో నిర్మించిన పంచాయతీ కార్యాలయం ప్రారంభం

Gram Panchayat | గన్నవరం, ఆంధ్రప్రభ : విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు తాము పుట్టిన గ్రామాల అభివృద్ధికి సహకరించాలని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు (MLA Yarlagadda Venkat Rao) పిలుపునిచ్చారు. గన్నవరం మండలం బీబీ గూడెం గ్రామంలో రూ. 55 లక్షల వ్యయంతో దాతల సహకారంతో నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని బుధవారం ఉదయం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రభుత్వ నిధులతో గ్రామాల అభివృద్ధికి నిధుల కొరత వల్ల జాప్యం జరుగుతుందని, దీన్ని నివారించేందుకు ఎన్నారైలు తమ సంపాదనలో కొంత భాగాన్ని సొంత‌ గ్రామాల అభివృద్ధికి వెచ్చించాలని సూచించారు. గన్నవరం నియోజకవర్గంలోని 84 గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో యువకులు విదేశాల్లో స్థిరపడ్డారని, వారిలో ప్రతి ఒక్కరూ కనీసం వెయ్యి డాలర్ల చొప్పున ఇచ్చినా గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పరంగా దేశంలోనే మొదటి స్థానంలో నిలపవచ్చని అభిప్రాయపడ్డారు.

గతంలో వైద్యశాలలు, విద్యాసంస్థలు (Educational institutions) దాతల సాయంతోనే నడిచేవని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వాలు వచ్చిన కొత్తలో దాతలు ఇచ్చిన భూముల్లోనే ప్రభుత్వ భవనాలు నిర్మించేవారని తెలిపారు. కొందరు కుటుంబ సభ్యుల కన్నా డబ్బును ఎక్కువగా ప్రేమిస్తున్నారని ఈ పద్ధతి సరికాదన్నారు. బీబీగూడెం గ్రామస్తులను ఆదర్శంగా తీసుకొని దాతలు ముందుకు వచ్చి గ్రామాల అభివృద్ధిలో పాలుపంచు కోవాలని కోరారు. గ్రామంలో పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణ స్థల దాతలు కాట్రగడ్డ వెంకట నారాయణ, వేమూరి గోపాలరావు కుటుంబ సభ్యులను, భవన నిర్మాణానికి రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చిన డాక్టర్ బోయపాటి రాజేంద్ర లక్ష్మీ ప్రసాద్, రూ.పది లక్షల విరాళం ఇచ్చిన నాగళ్ళ విజయలక్ష్మి (పద్మావతి ), రూ.3 లక్షల చొప్పున విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్ బోయపాటి బసవపూర్ణయ్య (నల్లబాబు), పీఏసీఎస్ అధ్యక్షులు బోయపాటి బుల్లయ్యలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు.

ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొమ్మరాజు సుధీర్, గ్రామ సర్పంచ్ దొప్పలపూడి జయలక్ష్మి, ఎంపీటీసీ మోరం నాగరాణి, ఏఎంసీ మాజీ చైర్మన్ కోటగిరి వరప్రసాద్, టీడీపీ మండల అధ్యక్షులు గూడపాటి తులసి మోహన్, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు, జనసేన నాయకులు చిమట రవివర్మ, సురేంద్ర, టీడీపీ నాయకులు పడమట రంగారావు, పోలవరపు శ్రీనివాస్, కంచర్ల సూర్యప్రకాష్, మేడేపల్లి రమ, యనమదల సతీష్, కాట్రు రమేష్, మాచినేని సుధీర్ (Machineni Sudheer) పాల్గొన్నారు.

Leave a Reply