పోలీస్ కస్టడీ నుంచి గుత్తేదారు పరారీ

పోలీస్ కస్టడీ నుంచి గుత్తేదారు పరారీ
ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఇందిరమ్మ లబ్ధిదారుని చేతులు కట్టి దౌర్జన్యానికి పాల్పడ్డ కేసులో పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడు కాంట్రాక్టర్ (Contractor) పరారైన సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపింది. ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలం కౌట కె గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతున్న గుత్తేదారు సత్యనారాయణ లబ్ధిదారు దీక్ష భర్త మారుతిని రెండు రోజుల క్రితం నడి రోడ్డుపై చేతులు కట్టేసి దాష్టీకానికి పాల్పడ్డ ఘటన అలజడి రేపింది.
ఇందిరమ్మ లబ్ధిదారుని అకౌంట్లో పడ్డ డబ్బులు గుత్తేదారుకు ఇవ్వకపోవడంతో గుత్తేదారు సత్యనారాయణ రెచ్చిపోయి లబ్ధిదారుని చేతులు కట్టేసిన ఘటన విదితమే. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ రాజార్షి షా సీరియస్ గా స్పందించారు. ఆ కాంట్రాక్టర్ సత్యనారాయణ పై కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు. గుత్తేదారును బ్లాక్ లిస్టులో పెట్టారు.
బోత్ పోలీసులు (police) కేసు నమోదు చేసి సత్యనారాయణను అరెస్టు చేసి కస్టడీలో ఉంచారు. కస్టడీలో ఉండగానే రాత్రి భోజనం చేశాక వాష్ రూమ్ కు వెళ్లి వస్తానని చెప్పి పోలీస్ స్టేషన్ వెనుక నుండి పరారయ్యాడు. నిందితుడు మహారాష్ట్ర వైపు పారిపోయినట్టు తెలుసుకొని పోలీసులు గాలిస్తున్నారు. కాగా పరారైన కాంట్రాక్టర్ గతంలో దళిత బస్తీ, దళిత బంధు పథకంలో దళారీ అవతారంలో లబ్ధిదారుల నుండి లక్షల డబ్బులు వసూలు చేయడం బాధితులు ఫిర్యాదు చేయడం అప్పట్లో కలకలం రేపింది. నిందితుడు పరారైన విషయం వాస్తవమేనని, అన్నిచోట్ల గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
