TG | కాంగ్రెస్ ఖేల్ ఖతం.. దుకాణ్ బంద్ : బండి సంజయ్

ఎల్లారెడ్డిపేట, ఆంధ్రప్రభ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుందని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రం దివాలా తీసిందని చెప్పడం రాష్ట్రంలో ఆ పార్టీకి పుట్టగతులు లేవని చెప్పేందుకు నిదర్శనమ‌న్నారు. అధికారం కోసం ఇచ్చిన హామీలను అమలు కావని ముఖ్యమంత్రి మాటలతో అర్థమైందన్నారు. ఇక‌ రైతుల హామీలన్నీ గాలికొదిలేసినట్లేనని, వృద్దులకు రూ.4వేల ఫించన్ ఇక‌ ఇయ్యరని, మహిళలకు నెలనెలా రూ.2500లు, తులం బంగారం ఒట్టిమాటేనని తేలిందన్నారు. నిరుద్యోగులకు రూ.4వేల భృతి ఇక‌ రాదని, విద్యార్థులకు రూ.5లక్షల భరోసా కార్డు ఇక‌ ఇయ్యరని తేల్చేశారన్నారు.

మోసాల కాంగ్రెస్ ను వదిలిపెట్టబోం..
హామీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టం. రేపటి నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులను నిలదీస్తాం.. సంవిధాన్ చేత పట్టి రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలేమైనయ్, రాహుల్ సమాధానం చెప్పి తీరాల్సిందేన‌న్నారు.

రాజీవ్ రహదారిపై కాంగ్రెస్ వన్నీ ఝూటా మాటలే…
రాజీవ్ రహదారిని నాగుపాములెక్క వంకర టింకరగా రోడ్డును నిర్మించింది కాంగ్రెస్సే. కమీషన్లకు కక్కుర్తిపడి నాసిరకం పనులు చేయించింది కాంగ్రెస్సే. 2035 వరకు కాంట్రాక్టర్ తో అగ్రిమెంట్ చేయించుకున్నది కాంగ్రెస్సే.ఆ కాంట్రాక్ట్ తో ఉన్న సమస్యను పరిష్కరించుకోవాలని కేంద్రం చెప్పింది నిజం కాదా అన్నారు. ఆ సమస్యను పరిష్కరిస్తే 6 లేన్ జాతీయ రహదారిగా విస్తరిస్తామని 2022లోనే చెప్పలేదా. నిన్న కోమటిరెడ్డికి కూడా గడ్కరీ ఇదే విషయాన్ని చెప్పారు. అయినా లేఖల పేరుతో కేంద్రంపై బురద చల్లడం ఎంత వరకు కరెక్ట్ అని బండి సంజ‌య్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *