కాంగ్రెస్ తప్పుడు నిర్ణయాలతో పేదలకు నష్టం

కాంగ్రెస్ తప్పుడు నిర్ణయాలతో పేదలకు నష్టం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) వందేళ్ల ముందు చూపుతో నగరం నలువైపులా నాలుగు టిమ్స్ ఆసుపత్రులు నిర్మించ తలపెట్టారని, ప్రస్తుత ప్రభుత్వం బుద్ధిమాంద్యంతో వాటిని పూర్తి చేయలేదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. అప్పట్లో టిమ్స్ లతో పాటు, నిమ్స్ రెండు వేల పడకల ఆసుపత్రి నిర్మించాలని శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. గతంలో అనేక ప్రభుత్వాలు పని చేసినా నిజాం కాలంలో కట్టిన గాంధీ, ఉస్మానియా, కింగ్ కోఠి ఆసుపత్రులే ఉన్నాయి.
కేసీఆర్ పేదల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని, నాణ్యమైన సూపర్ స్పెషాలిటీ (super specialty) వైద్యం ప్రజలకు చేరువ చేసేలా నాలుగు టిమ్స్ ఆసుపత్రులు, వరంగల్ హెల్త్ సిటీ పనులను ప్రారంభించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకుల తప్పుడు చర్యల వల్ల ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఈరోజు ఎల్‌బీ నగర్‌లోని టిమ్స్ ఆస్పత్రి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద, కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మాజీ చైర్మన్లు, ఇతర సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు వెంట ఉన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక…
ఆస్పత్రుల నిర్మాణానికి నిధులు పూర్తి స్థాయిలో కేటాయించారని, దాదాపు పనులు పూర్తి చేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) అధికారంలోకి వచ్చాక పనులు ముందుకు పోవడంతో ప్రారంభానికి నోచుకోలేదని హరీశ్‌రావు అన్నారు. సెల్లార్ తో కలుపుకొని ఆరు అంతస్తుల భవనం ఎల్బీ నగర్ టిమ్స్ పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. రెండేళ్లలో ఐదు అంతస్తులు మాత్రమే పూర్తి చేశారన్నారు. బీఆర్ఎస్ (BRS) అధికారంలో ఉంటే ఈ ఆస్పత్రుల్లో ద్వారా ప్రజలకు సేవలు అంది ఉండేవి అన్నారు. ఎందుకు పనులు నిలుపు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
పది వేలు బెడ్స్ ఉండాలని…
రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీలో పది వేల బెడ్స్ ఉండాలని కేసీఆర్ (KCR) చూశారని హరీశ్‌రావు చెప్పారు. 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఉండేలా ప్రణాళిక చేశారని గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో తమ ప్రభుత్వం మెడికల్ కాలేజీ మంజూరు చేస్తే, జీవో జారీ చేస్తే, దాన్ని ఈ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. మహేళ్వరంలో మెడికల్ కాలేజీ లేకుండా చేశారని, కుత్బుల్లాపూర్ లో మెడికల్ కాలేజీ శాంక్షన్ చేస్తే, దాన్ని టిమ్స్ అల్వాల్ లో కలిపేశారన్నారు. వరంగల్ హెల్త్ సిటీ, హైదరాబాద్ టిమ్స్ ఆసుపత్రులను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
