- బీసీ డిక్లరేషన్ అమలు దిశగా కాంగ్రెస్ అధిష్టానం అడుగులు
- ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎంపికకోసం బడుగుల పట్టు
- మున్నూరు కాపు నేతలకే అవశామివ్వాలని నేతల డిమాండ్
- రేసులో ముందున్న అధికార ప్రతినిధి డా.కొనగాల మహేష్
కాంగ్రెస్ పార్టీలో బడుగులకు అవకాశం కల్పించాలన్న చర్చ జరుగుతోంది… కామారెడ్డి కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను పక్కాగా అమలు చేయాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. ఇప్పటికే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న విమర్శల నేపథ్యంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటు వేయగా.. ఆయన వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దకూడదన్న వాదన బీసీ నేతల నుంచి వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. జాతీయ నాయకులు సైతం బీసీలకు పెద్దపీట వేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి దాదాపు 15 నెలలు కావొస్తున్న సందర్భంలో.. ఎటువంటి ప్రాధాన్యత లభించని మున్నూరు కాపులకు సముచిత స్థానం కల్పించాలని పలువురు కోరుతున్నారు. దీంతో ఈ దఫా ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీగా అవకాశం లభించనుందన్న విశ్వసనీయ సమాచారం మున్నూరుకాపులకు ఊరటనిస్తోంది.
ఆంధ్రప్రభ బ్యూరో, గ్రేటర్ హైదరాబాద్ : అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ముందుకు సాగే కాంగ్రెస్ పార్టీలో బీసీ నేతలకు ప్రాధాన్యతనిచ్చే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పార్టీ ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకు ఎందరో కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దిన పార్టీ, దేశంలో సంక్షేమ పథకాల అమలు చేయడం, అన్నిరంగాల్లో గ్రామాలను సైతం అభివృద్ధిచేయడం, దేశంలో ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకు వచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది.
అంతటి ఘనచరిత్ర గలిగిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో అధికారం చేపట్టి దాదాపు 15 నెలలు పూర్తి కావొస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ, బీసీ నేత తీన్మార్ మల్లన్న ఘటన చోటు చేసుకోవడం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జిగా విచ్చేసిన మీనాక్షీ నటరాజన్ సస్పెన్షన్ వేటు వేయడం జరిగిపోయింది. ఈ క్రమంలోనే బీసీల కోసం కామారెడ్డి కేంద్రంగా తమ పార్టీ అధినేతలు ఇచ్చిన హామీలను తప్పక నెరవేర్చడం ద్వారా బీసీలకు పెద్దపీట వేసి తీరాలన్న ఆకాంక్ష ఆ పార్టీ ముఖ్య నేతల నుంచి వ్యక్తమవుతోంది.
ఎమ్మెల్సీ రేసులో మున్నూరు కాపులు..
కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటికీ, బీసీ కులాల్లోని మున్నూరుకాపులకు ప్రాధాన్యత లభించలేదన్న ఆవేదన ఆ వర్గం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కేంద్రమంత్రి పదవి ఒకరికి, రాజ్యసభ సభ్యునిగా ఒకరికి, లోక్‌సభ స భ్యులుగా ఇరువురికి అవకాశం కల్పించి, మున్నూరు కాపులకు పెద్దపీట వేసింది.
మరోవైపు తెలంగాణలోని ప్రధాన విపక్షమైన బీఆర్‌ఎస్ సైతం ఒకరిని రాజ్యసభ సభ్యునిగా, ఇరువురికి ఎమ్మెల్సీలుగా మొత్తంగా ముగ్గురికి మున్నూరుకాపు సామాజికవర్గం తరుపున అవకాశం కల్పించినట్లయింది. కాగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరికీ కూడా అవకాశం కల్పించలేదని, దీంతో ప్రస్తుతం ఎన్నికల నగారా మోగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలోనైనా తమ వర్గానికి అవకాశం కల్పించాలని మున్నూరుకాపు నాయకులు కోరుతున్నారు.
అటు బీసీ నేత తీన్మార్‌పై వేటు, ఇటు బీసీ డిక్లరేషన్ అమలుకు అధిష్టానం అనుకూలంగా ఉండటంతో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన తమకు అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు.
రేసులో కొనగాల మహేష్ పేరు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన వారికి అవకాశం కల్పించాలన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. బీసీ డిక్లరేషన్ అమలులో భాగంగా ఆ పార్టీ అధిష్టానం కూడా ఆ దశగానే అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
దీంతో బీసీ సామాజికవర్గానికి చెందిన యువనేతలకు అవకాశం కల్పించడం ద్వారా భావి నాయకత్వానికి సైతం పెద్దపీట వేయాలన్న యోచనతో ఆ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. యువ నాయకత్వానికి ప్రాధాన్యత నివ్వాలని హైకమాండ్ దిశానిర్దేశం చేయటంతో బీసీ మున్నురుకాపు నుండి డా.కొనగాల మహేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ఉన్నత విద్యావంతుడైన మహేష్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి కామర్స్ విభాగం నుండి డాక్టరేట్(పీహెచ్డీ) పట్టా పొందారు. తెలంగాణ ఉద్యమంలో ఓయూ కేంద్రంగా క్రియాశీలకంగా పనిచేసి 107 కేసుల్లో 35రోజుల జైలు జీవితం గడిపారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
2014 ఎన్నికల్లో ప్రచార కమిటీ సభ్యుడిగా పని చేసిన మహేష్ తనకున్న విషయ పరిజ్ఞానం, రాజకీయ అంశాలపై పట్టు, వాగ్దాటితో పార్టీలో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. దీంతో ఎన్నికల అనంతరం రాష్ట్ర అధికార ప్రతినిధిగా పార్టీ నియమించింది.
11ఏళ్లుగా అధికార ప్రతినిధిగా 3000కు పైగా లైవ్ చర్చల్లో ఆయన పాల్గొని, 50కి పైగా ఎడిట్ పేజీ ఆర్టికల్స్ రాశారు. మహేష్‌ను 2018లో ఏఐసీసీ సభ్యునిగా పార్టీ ఎంపిక చేసింది. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎండగట్టిన మహేష్, ప్రస్తుత అధికార పార్టీ నేతగా ప్రభుత్వంపై, పార్టీ విధానాలపై విమర్శలు గుప్పించే వారిని సమర్థవంతంగా ఎదుర్కొన గలుగుతారన్న పేరు మహేష్ సంపాదించారు.
మున్నూరు కాపులకు అవకాశం కల్పించాలి
బీసీ సామాజికవర్గంలో బలమైన మున్నూరు కాపులకు ప్రాధాన్యత కల్పించాలని ఏఐసీసీ సభ్యుడు, బీసీనేత డా.కొనగాల మహేష్ కోరారు. బీసీ గళం బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఎటువంటి ప్రాధాన్యత దక్కని తమ మున్నూరుకాపులకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు. ఈ మేరకు అధిష్టానం తమ అభిమాతానికి పెద్దపీట వేస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.