KTR | రాహుల్ గాంధీపై మండిపడ్డ కేటీఆర్
KTR | హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శంగా చూపించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. కులగణన పేరుతో భారీగా ప్రజాధనాన్ని ఖర్చు చేసి, చివరకు బీసీ వర్గాలకు అన్యాయం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో (local body elections) బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన పేరుతో రూ.160 కోట్లను ఖర్చు చేసిందని కేటీఆర్ తెలిపారు. చివరకు పంచాయతీ ఎన్నికలు వచ్చేసరికి బీసీలకు కేవలం 17శాతం రిజర్వేషన్లనే కేటాయించిందని పేర్కొన్నారు. గతంలో బీసీలకు ఉన్న 24శాతం కోటాను కూడా ఇవ్వకుండా కోత పెట్టి బడుగులకు వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. కులగణన పేరిట ప్రజా ధనాన్ని వృథా చేసి, చివరకు బీసీ రిజర్వేషన్లను తగ్గించడానికి కాంగ్రెస్ నాయకత్వం ఏ జ్ఞానంతో పనిచేసిందని ఆయన ప్రశ్నించారు. ఈ మోసంపై స్పందిస్తారా అని రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ని నిలదీశారు.
సుదీర్ఘకాలంపాటు దేశాన్ని ఏలిన అనుభవం. రాజ్యాంగ మార్గదర్శకాలు.. సుప్రీంకోర్టు (Supreme Court) ఆంక్షలు.. అమల్లో ఉన్న చట్టాలు అన్నీ తెలుసు. అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలను గుప్పించిందన్నారు. బీసీ కుల గణాంకాలు, తెలంగాణ జనాభా లెక్కలు తదితర అంశాలపై తీవ్ర అభ్యంతరాలు రావడంతో 2025 ఫిబ్రవరి 16 నుంచి 28వ తేదీ వరకు రీ సర్వే నిర్వహించిన ప్రభుత్వం.. స్థూలంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ గణాంకాలను వెల్లడించింది తప్ప, కులాలు, ఉపకులాల వారీగా లెక్కలేవీ వెల్లడించలేదు.
నివేదికను బహిర్గత పరచలేదు. అభ్యంతరాల స్వీకరణ చేపట్టనూ లేదు. ఇదీ రాజ్యాంగ విరుద్ధమన్నారు. సర్వే నివేదికలనే కాదు బూసాని వెంకటేశ్వర్లు (Boosani Venkateswarlu) నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదికలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ బయటపెట్టలేదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు రిజర్వేషన్ల స్థిరీకరణకు బీసీ కమిషన్‌కు అధికారాల్లేవు. అందుకోసం ప్రత్యేకంగా ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సిందే. కానీ, ప్రభుత్వం ఆ నిబంధనలు తుంగలోతొక్కి రిజర్వేషన్ల స్థిరీకరణ బాధ్యతలను సైతం తెలంగాణ బీసీ కమిషన్‌కు అప్పగిస్తూ 2024 సెప్టెంబర్ 6న జీవో-199 జారీచేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టడమే కాకుండా, డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సిందేనని 2024 అక్టోబర్ 30న హైకోర్టు తీర్పుచెప్పిందన్నారు. హైకోర్టు మొట్టికాయలతో కాంగ్రెస్ సర్కారు కండ్లు తెరచిందన్నారు. అయితే ఇంటింటి సర్వేకు సంబంధించి రీ సర్వే 2025 ఫిబ్రవరి 16 నుంచి 28వ తేదీ వరకు కొనసాగింది. ఆ గణాంకాలు లేకుండానే కమిషన్ నివేదికను సమర్పించడం కొసమెరుపు అన్నారు.

