Congress | నిముష నిముషానికి మారుతున్న రాజకీయం

Congress | నిముష నిముషానికి మారుతున్న రాజకీయం

Congress | కరీంనగర్ కార్పొరేషన్‌లో రసవత్తర రాజకీయం
బీజేపీ బలం పెరిగినా మారిన సమీకరణాలు
కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్‌తో మారిన పరిస్థితి
సాయి జ్యోతి కాంగ్రెస్ శిబిరంలోకి
ఎక్స్ ఆఫీషియో సభ్యుల ఓట్లు కీలకం
మేయర్ పీఠం కాంగ్రెస్ ఖాతాలోకి?
కార్పొరేటర్లకు కాసుల ఆఫర్లు?

కరీంనగర్, ఆంధ్రప్రభ : కరీంనగర్ కార్పొరేషన్ రాజకీయం నిముష నిమిషానికి మారుతూ రసవత్తరంగా మారింది. కరీంనగర్ మేయర్ పీఠం కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లనుంది. కౌంటింగ్ జరిగిన నాటి నుండి కరీంనగర్ పీఠం బిజెపి కేనని అందరూ భావించగా అనూహ్యంగా కాంగ్రెస్ మేయర్ కుర్చీని వశం చేసుకోనుంది. 66 స్థానాలు ఉన్న కరీంనగర్ కార్పొరేషన్ లో 30 స్థానాలను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోగా అధికార కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలను, బిఆర్ఎస్ 9 స్థానాలను, ఎంఐఎం మూడు స్థానాలను, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రెండు స్థానాలను, స్వతంత్ర అభ్యర్థులు 8 స్థానాలను కైవసం చేసుకున్నారు.

ఫలితాలు వెలువడిన వెంటనే బిజెపి కార్పొరేటర్ లను క్యాంపుకు తరలించారు. ఇది గమనించిన అధికార పార్టీ తోపాటు కాంగ్రెస్ ఎంఐఎంలు సైతం వారి అభ్యర్థుల ను హైదరాబాద్ క్యాంపుకు తరలించారు. కౌంటింగ్ జరిగిన రోజున రాత్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో 13వ డివిజన్ నుండి గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి తెల్ల లక్ష్మి, 15వ డివిజన్ నుండి ఫార్వర్డ్ బ్లాక్ తరఫున గెలుపొందిన విఫల సాయి జ్యోతి లు కాషాయం గూటికి చేరారు.

దీంతో వారి బలం 32 కు చేరింది. శనివారం 17వ వార్డు నుండి గెలుపొందిన వేముల కవితా చంద్రశేఖర్, 39 వ వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన మాసం గణేష్ లు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో బిజెపిలో చేరారు. దీంతో బీజేపీ బలం 34 చేరింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కు ఎక్స్ అఫీషియో మెంబర్షిప్ ఉండడంతో వారి బలం 35కు చేరింది. ఇంకేముంది కరీంనగర్ మేయర్ పీఠం బిజెపికి చేజిక్కించుకోవడం లాంచనమే అని భావించారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. అధికార కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పీఠం ఎలాగైనా దక్కించుకోవాలని పావులు కదపడం మొదలెట్టింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎలాగైనా మేయర్ పీఠం దక్కించుకోవాల్సిందేనని ఆ బాధ్యతలు మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు లకు అప్పగించారు. ఇంకేముంది కరీంనగర్ పీఠం దక్కించుకునే విధంగా చర్యలు చేపట్టారు. కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎమ్ఐఏం స్వతంత్ర అభ్యర్థులతో కలిసి కరీంనగర్ పీఠం దక్కించుకోవాలని మాస్టర్ ప్లాన్ వేశారు. ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులను హైదరాబాదులోని క్యాంప్ కు తరలించారు. దీంతో వారి బలం 32 కు చేరింది. బిజెపి క్యాంపులో 34, కాంగ్రెస్ క్యాంపులో 32 మంది సభ్యులు చేరారు.

కాంగ్రెస్ క్యాంపుకు సాయి జ్యోతి

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కరీంనగర్ పీఠం ఎలాగైనా దక్కించుకోవాలని మాస్టర్ మైండ్ ఉపయోగించారు. ఫలితాలు వెలువడిన రోజున బిజెపిలో చేరిన ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి విఫల సాయి జ్యోతిని ఒప్పించి కరీంనగర్ నుండి హైదరాబాదులోని కాంగ్రెస్ క్యాంపుకు తరలించారు. సాయి జ్యోతి కాంగ్రెస్ క్యాంపులో చేరడంతో వారి బలం 33కు చేరింది.

ఎక్స్ అఫీషియో సభ్యులే కీలకము

కరీంనగర్ మేయర్ పీఠం కోసం సోమవారం జరిగే ఎన్నికల్లో సభ్యులు కీలకంగా మారారు. కాంగ్రెస్, బిజెపి క్యాంపుల్లో సమానంగా 33 మంది కార్పొరేటర్లు ఉండడంతో ఎక్స్ ఆఫీషియో ఓట్లు కీలకంగా మారాయి. కరీంనగర్ కార్పొరేషన్ ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ లు ఉన్నారు.

మేయర్ పీఠం కాంగ్రెస్ కే

కరీంనగర్ కార్పొరేషన్ లో మొత్తం 66 మంది సభ్యులు ఉండగా ఎక్స్ ఆ సభ్యులతో కలిపి ఆ సంఖ్య 69కే చేరింది. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పిట్ అఫ్ దక్కాలంటే మ్యాజిక్ ఫిగర్ 35 గా ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ శిబిరంలో 33 మంది కార్పొరేటర్లు, బిజెపి శిబిరం లో 33 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఎక్స్ ఆఫిషియో సభ్యులతో కలిసి కాంగ్రెస్ బలం 35 గా ఉండగా, బిజెపి బలం 34 గా ఉంది. దీంతో సోమవారం కరీంనగర్ మేయర్ పీఠం కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లనుంది.

కార్పొరేటర్లకు కాసుల వర్షం

కరీంనగర్ లో గెలుపొందిన కార్పోరేట్టర్లకు కాసుల వర్షం కురుస్తుంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలు కరీంనగర్ మేయర్ పీఠం ఎలాగైనా దక్కించుకోవాలని పావులు కదుపుతున్నారు. దీంతో కరీంనగర్లో గెలిచిన కార్పొరేటర్ల ధర కోట్ల రూపాయలకు చేరింది. ఒక్కో కార్పొరేటర్ కు తమకు మద్దతిస్తే కోటి రూపాయల నుండి మూడు కోట్ల రూపాయల వరకు నగదు రూపంలో ఇస్తామని రెండు పార్టీలు ఆఫర్ చేస్తున్నాయి. దీంతో కరీంనగర్లో గెలిచిన కార్పొరేటర్లు ఒక్కరోజులోనే కోటీశ్వరులుగా మారనున్నారు.

Leave a Reply