- రాజకీయ విమర్షలతో కాలయాపన చేస్తున్నారు
- కాంగ్రెస్ పాలనపై విరుచుకుపడిన కేసీఆర్
- రైతు సంక్షేమమే ప్రాధాన్యం
- క్షేత్రస్థాయిలో పోరాటాల కోసం కేసీఆర్ పిలుపు
- బీఆర్ఎస్ నేతలతో వ్యూహాత్మక సమావేశం..
హైదరాబాద్: రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం విధానాలను బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) తీవ్రంగా విమర్శించారు.
ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ నేతలతో జరిగిన వ్యూహాత్మక సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ, “ప్రజలు బాగా గమనిస్తున్నారు… రాష్ట్ర సీఎం ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోదీ ప్రయోజనాల కోసం పరితపిస్తున్నారు” అన్నారు. ప్రజా సమస్యలపై దృష్టిపెట్టకుండా కాంగ్రెస్, బీజేపీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కాలయాపన చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలి…
ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ తెలంగాణ సాగునీటి హక్కులకు తీవ్రంగా ముప్పుగా మారుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయాలన్న దిశగా బీఆర్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేపట్టాలని సూచించారు. “తెలంగాణ ప్రభుత్వం ప్రో-ఆంధ్ర విధానాలతో రైతుల పట్ల తీవ్ర అన్యాయం చేస్తోంది,” అని మండిపడ్డారు.
వ్యవసాయ నిర్లక్ష్యం.. యూరియా కొరతపై ఆందోళనలు
వరి సాగు సమయానికి రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉండడం, వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తీవ్రంగా తప్పుబట్టారు. “ఇది క్షమించలేని తప్పు. దీనిపై ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ తీవ్రంగా ఉద్యమించాలి,” అని కేసీఆర్ పిలుపునిచ్చారు.
తెలంగాణ రైతులకు జీవిత రేఖ అయిన కాలేశ్వరం ప్రాజెక్ట్ను ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం పక్కన పెట్టిందని కేసీఆర్ ఆరోపించారు. వానాకాలం నాట్లు పూర్తయిన ఈ సమయంలో కూడా గోదావరి నీటిని ఎత్తిపోసే పంఫ్లు తిప్పకపోవడం రైతులకు సాగునీరు అందకుండా చేశిందని విమర్శించారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద నీటిని ఎత్తి చెరువులు, కుంటలు నింపాలని డిమాండ్ చేశారు.
రైతుల పక్షంలో బీఆర్ఎస్..
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ విభాగంపై దృష్టి పెట్టకుండా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన సాగిస్తోంది. ఇప్పుడు ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త రైతుల పక్షాన నిలబడి పోరాటానికి సిద్ధం కావాలి. బీఆర్ఎస్ అనుబంధ విభాగాలన్నింటినీ బలోపేతం చేస్తూ క్షేత్రస్థాయిలో ఉద్యమాలను ముమ్మరం చేయాలని కేసిఆర్ అన్నారు.
ఈ వ్యూహాత్మక సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి వంటి సీనియర్ నాయకులు పాల్గొన్నారు. రైతు సంక్షేమం, సాగునీటి సంరక్షణ కోసం క్షేత్ర స్థాయిలో తీవ్రమైన ఉద్యమాలను చేపట్టే లక్ష్యంతో ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.