Congress | పంచాయతీకి కాంగ్రెస్ సన్నద్ధం..

Congress | పంచాయతీకి కాంగ్రెస్ సన్నద్ధం..
Congress, హైదరాబాద్, ఆంధ్రప్రభ: కొత్త డీసీసీ అధ్యక్షుల సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎన్నికలకు సిద్ధమైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఉత్సాహంతో ఉన్న ఆ పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని సన్నా హాలు చేస్తోంది. అధికార పార్టీ కావడంతో మెజారీటీ పంచాయతీలను గెలుస్తామన్న నమ్మకం ఉన్నప్పటికీ, ఏ ఒక్క అవకాశాన్ని జారవిడుచుకోకుండా మెజారిటీ స్థానాల్లో జై కొట్టేందుకు వ్యూహరచన చేస్తోంది. డీసీసీ అధ్యక్షలుగా నియమితులైన కొత్త సారథులు అప్పుడే తమ జిల్లాల్లో ఎక్కడెక్కడ ఎవరికి టికెట్టివ్వాలనే విషయమై కింది స్థాయి నేతలతో చర్చిస్తున్నారు. జిల్లా మంత్రులు, ఇంచార్జ్ మంత్రుల ఆదేశాలతో తమ పని ప్రారంభించారు.
ఏఐసీసీ (AICC) ప్రకటించిన 36 డీసీసీ అధ్యక్షుల్లో ముందుగా ప్రకటించినట్లుగానే మెజారిటీ డీసీసీలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించడంతో ఈ వర్గాలకు చెందిన నేతలు ఉత్సాహంగా ఉన్నారు. బడుగు, బలహీన వర్గాలకు పార్టీ అండగా ఉంటుందని నిరూపించుకుందని, గ్రామస్థాయిలో జనం కూడా ఆదరిస్తారనే భరోసాతో నేతలు ఉన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు బీసీ రిజర్వేషన్లను శాసనసభ సాక్షిగా 42 శాతం పెంచినప్పటికీ, చట్టబద్ధత కల్పిండానికి కేంద్రం అడ్డుపుల్ల వేసిందనే ప్రధాన నినాదాలతో ఎన్నికలకు వెళుతోంది. అంతేగాక ఎక్కడికక్కడ స్థానిక సమస్యలే ఎజెండాగా ఎన్నికల ప్రణాళికలు రూపొందించేందుకు ఇప్పటికే కింది స్థాయి శ్రేణులకు ఆదేశాలు ఇచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో కూడా బీసీలకు 42 శాతం టికెట్లను ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
మరి కొన్ని వార్తలకు లింక్ క్లిక్ చేయండి.
https://epaper.prabhanews.com
