- జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ నిధులు రూ. 12 లక్షలతో ప్రభుత్వ ఆస్పత్రిలో అభివృద్ధి పనులు
- నూతనంగా 17 కంప్యూటర్లు ఏర్పాటు
- మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడి
నంద్యాల బ్యూరో అక్టోబర్ 31 ఆంధ్రప్రభ : ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నంద్యాల జిల్లాలోని బనగానపల్లె ప్రభుత్వాసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగుల ఆన్లైన్ పేషెంట్ రిజిస్ట్రేషన్, ఇన్ పేషెంట్, డిశ్చార్జ్ వంటి రోగుల సమగ్ర సమాచారం నిర్వహణకు డిజిటలైజెషన్ ప్రక్రియలో భాగంగా స్థానిక 100 పడకల ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేశామని తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రికి 17కంప్యూటర్లు, 5 ప్రింటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని జిల్లాలోనే నంబర్ వన్‌గా నిలపాలని మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి తరహాలో బనగానపల్లె ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. స్థానికంగా రోగులకు సంబంధించిన పూర్తిస్థాయి మెడికల్ రికార్డును నిర్వహించాలనే ఉద్దేశంతో నూతనంగా కంప్యూటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు.

ఒక్కసారి డిజిటలైజేషన్ చేస్తే రోగులకు సంబంధించిన సమగ్ర రిపోర్టులు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయన్నారు. కూటమి ప్రభుత్వం వైద్యరంగంలో టెక్నాలజీని వినియోగించి రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో మరో కోటి రూపాయలతో ఆసుపత్రిని ఆధునికరిస్తామని మంత్రి తెలిపారు. డాక్టర్లు రోగులకు అందుబాటులో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో పలువు రు డాక్టర్లు సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.

