రాష్ట్రంలో అభివృద్ధి పనుల ఆమోదం, పర్యవేక్షణలో క్రమబద్ధత తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో చేపట్టబోయే అన్ని కొత్త ప్రాజెక్టులు, ఇప్పటికే కొనసాగుతున్న పనులు, వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులకు మంత్రుల కమిటీ అనుమతి తప్పనిసరి కానుంది.
ఐదుగురు మంత్రులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన ఐదుగురు మంత్రులతో ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సభ్యులుగా ఉన్నారు.
అభివృద్ధి పనుల పర్యవేక్షణలో కఠిన విధానం
ఈ కమిటీ రాష్ట్రంలోని అభివృద్ధి పనుల మంజూర్లు, పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పనపై సమగ్ర పర్యవేక్షణ చేస్తుంది. ఇకపై ఏ పనికైనా ఈ కమిటీ ఆమోదం లేకుండా అమలు చేయరాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.