భార్య కాపురానికి రాకపోవడంతో ఆత్మహత్య..
కామారెడ్డి, ఆంధ్రప్రభ : భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన ఏఆర్ కానిస్టేబుల్ జీవన్ రెడ్డి(Constable Jeevan Reddy) (37) ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కామారెడ్డి పట్టణం అడ్లూర్ శివారులోని రాధాస్వామి సత్సంగ్ వెనకాల ఈ రోజు చోటు చేసుకుంది.
కుటుంబ సభ్యుల కథనం మేరకు.. రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన రేకులపల్లి జీవన్ రెడ్డి (37) వ్యక్తి ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. జీవన్ రెడ్డికి ముస్తాబాద్ మండలం మెర్రాయిపల్లి(Merraipalli) గ్రామానికి చెందిన చందనతో వివాహం జరిగింది. వీరికి మోక్ష, కృతిక అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్యాభర్తల మధ్య గత రెండు, మూడేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఏడాదిన్నర నుంచి చందన తన పుట్టింటికి వెళ్ళిపోయింది.
అప్పటి నుంచి ఎన్నిసార్లు అడిగినా కాపురానికి రాలేదు. ఇటీవల విడాకుల నోటీసులు(divorce notices) రావడంతో జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ రోజు డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి బైకుపై ఇంట్లో నుంచి బయలుదేరాడు. ఇంట్లో నుంచి వెళ్లిన జీవన్ రెడ్డి కామారెడ్డి పట్టణం అడ్లూర్ శివారులో గల రాధాస్వామి సత్సంగ్ బ్యాస్ ఆశ్రమం వెనకాల మంటల్లో కాలిపోయిన మృతదేహం ఉండడంతో అది చూసిన పశువుల కాపరి పోలీసులకు సమాచారం అందించాడు.


దీంతో కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి(Chaitanya Reddy), రూరల్ సీఐ రామన్ ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కొద్దిసేపటి తర్వాత జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఘటనా స్థలానికి చేరుకుని మృతుని కుటుంబ సభ్యులతో ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

