Comments – దేశ గతిని మార్చే బడ్జెట్ – కేంద్ర మంత్రి బండి సంజయ్
న్యూ ఢిల్లీ – దేశ గతినే మార్చే అద్భుతమైన బడ్జెట్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్ర వార్షిక బడ్జెబ్‌పై ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి, యువత, రైతు సంక్షేమ బడ్జెట్ అని చెప్పారు. మధ్యతరగతి ఉద్యోగుల, వ్యాపారులకు ఈ బడ్జెట్ ఓ వరమన్నారు. రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు విప్లవాత్మకమన్నారు. దీనితో తెలంగాణ సహా దేశంలోని ఒక్కో ఉద్యోగికి రూ.80 వేల వరకు ఆదా అవనుందని తెలిపారు. గత 75 ఏళ్లలో మునుపెన్నడూ లేని విధంగా మధ్యతరగతికి అనుకూలమైన బడ్జెట్ ఇది అని వెల్లడించారు.
ప్రధాని, ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు…
2027 నాటికి అమెరికా, చైనా తరువాత మూడో ఆర్ధిక వ్యవస్థగా భారత్ అవతరించే దిశగా బడ్జెట్‌ను రూపకల్పన చేశారన్నారు. పత్తి, పప్పు దినుసులు పండించే రైతులకు లాభదాయకమైన బడ్జెట్ అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజల పక్షపాతి అనడానికి నిదర్శనమిది అని అన్నారు. ఇది సంక్షేమ బడ్జెట్- ప్రజల పెన్నిధి నరేంద్రమోదీ అని కొనియాడారు. ప్రధాని మోదీ, ఆర్ధిక మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. బడ్జెట్‌పై విపక్షాలు అనవసర విమర్శలు మానుకోవాలని హితవుపలికారు. కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.
ఉపాథి అవకాశాలు మరింత మెరుగు..
ఉపాధి అవకాశాలను పెంచి యువతను వ్యాపార, పారిశ్రామికవేత్తలను చేసేందుకు బడ్జెట్‌లో వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారులు, ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలు, వ్యాపారులకు రుణ పరిమితిని పెంచడం ఆహ్వానించదగ్గర పరిణామమన్నారు. ఎంస్ఎంఈ రుణాలను రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంచడంతో పాటు స్టార్టప్‌లకు రూ.20 కోట్ల వరకు రుణాలిస్తామని బడ్జెట్‌లో పేర్కొనడం ద్వారా యువతకు ఎంతో ప్రయోజనం కలగబోతోందన్నారు. గ్రామాల్లో వలసలను నివారించేందుకు ప్రత్యేక ప్రణాళికలను బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ పట్టణాలను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు బడ్జెట్‌లో కేటాయింపులు చేయడం సంతోషంగా ఉందన్నారు.