AP | ఇష్టపడి చదవండి.. రిజల్ట్ బాగా ఉంటుంది..
- సంక్షేమ వసతి గృహాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో ) : ప్రతి విద్యార్థి జీవితంలో 10వ తరగతి పరీక్షలు కీలక దశ అని.. బాగా చదువుకొని పరీక్షల్లో మంచి మార్కులు సాధించి ఉన్నత కోర్సుల దిశగా అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ విద్యార్థులకు సూచించారు. జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉండి చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా అధికారులు, సిబ్బంది చేస్తున్న కృషిని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం రాత్రి విజయవాడలోని కస్తూరిబాయి పేట సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించారు.
ఏ ఒక్క విద్యార్థీ పరీక్షల్లో ఫెయిల్ కాకుండా ప్రతిఒక్కరిపైనా ప్రత్యేకంగా దృష్టిసారించాలని ఈ సందర్భంగా వసతి గృహ అధికారులను ఆదేశించారు. మార్చి 17 నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పరీక్షల్లో 100శాతం ఉత్తీర్ణతకు కృషిచేయాలని.. చిన్నారులను తమ పిల్లలుగా భావించి, ప్రత్యేక శ్రద్ధపెట్టి అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు కృషిచేయాలన్నారు.
సబ్జెక్టు నిపుణులు, ట్యూటర్లతో ప్రత్యేక శిక్షణ ఇప్పించడం, విద్యార్థులు ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారో ఆయా అంశాలపై పట్టు సాధించేలా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి, విద్యార్థుల పురోగతిని పరిశీలించాలన్నారు.
మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలి….
బాపూజీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, అబ్దుల్ కలాం వంటి గొప్ప వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకొని కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు కృషిచేయాలని కలెక్టర్ వివిధ తరగతుల చిన్నారులకు సూచించారు. చిన్నారులకు పోషకాహారం అందించడంలోనూ, వ్యక్తిగత శుభ్రత పాటించే విషయంలోనూ వసతి గృహ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు.
ఈ సమయంలో అలవర్చుకున్న మంచి అలవాట్లే బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాయని పేర్కొన్నారు. ఇష్టపడుతూ చదవాలని అప్పుడే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు.
భవిష్యత్తులో మీరు ఏమి కావాలనుకుంటున్నారు.. అంటూ విద్యార్థులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట హాస్టల్ వార్డెన్ కృష్ణకుమారి ఉన్నారు.