రిజర్వేషన్లపై కలెక్టర్ సమీక్ష
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పంచాయతీరాజ్ శాఖ మార్గదర్శకాల ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్ ప్రక్రియ(Reservation process) పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి కలెక్టరేట్‌లో(at the Collectorate) ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధం, రిజర్వేషన్ల ఖరారుపై సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ శాఖ(Panchayati Raj Department) స్థానిక సంస్థల ఎన్నికల ప్రణాళికను విడుదల చేసిందని, దీని ప్రకారం జిల్లాలోని గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ(MPTC) సభ్యుడు, జడ్పీటీసీ సభ్యుడు, ఎంపీపీ, పంచాయతీ వార్డుల రిజర్వేషన్(Reservation) ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేయాలని అన్నారు. తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కుల గణన సర్వే ప్రాతిపదికన బీసీలకు 42 శాతం, ఎస్సీ, ఎస్టీ లకు 2011 జనాభా లెక్కల మేరకు, 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు.
షెడ్యూల్డ్ ఏరియాలో ఎంపీటీసీ సభ్యులు, వార్డు సభ్యుల రిజర్వేషన్ ఎస్టీ జనాభా దామాషాలో 50 శాతం తగ్గకుండా ఖరారు చేస్తారని, వంద శాతం ఎస్టీ గ్రామ పంచాయతీలో సర్పంచులు, వార్డు సభ్యుల పదవులన్నీవారికే రిజర్వ్ చేస్తారని కలెక్టర్ కోయశ్రీ తెలిపారు. జడ్పీటీసీ(ZPTC) సభ్యుడు, ఎంపీపీ అధ్యక్ష స్థానాలకు రిజర్వేషన్ కలెక్టర్ స్థాయిలో, ఎంపీటీసీ సర్పంచ్ పదవులకు ఆర్డీఓ, వార్డుల రిజర్వేషన్లను ఎంపీడీవో(MPDO) ఖరారు చేయాలని అన్నారు.
గత ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కేటాయించిన సీట్లను మినహాయించి, మిగిలిన వాటిలో ఆయా వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీ(General Category)లలో 50 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తారని, గత ఎన్నికల్లో మహిళలకు కేటాయించి సీట్లను మినహాయించి మిగిలిన వాటికి లాటరీ పద్ధతిన రిజర్వేషన్లు ఖరారు చేస్తారని, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు రిజర్వేషన్లు కేటాయించిన తర్వాత మిగిలిన సీట్లను జనరల్ గా గుర్తిస్తారని అన్నారు.
సమావేశంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య, జడ్పీ సీఈఓ నరేందర్, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.