లెంకలగడ్డలో కలెక్టర్ విస్తృత పర్యటన
- టోర్నడో తో ధ్వంసం అయిన ప్రాంతం పరిశీలన
- పంట నష్టపోయిన రైతులతో మాట్లాడిన కలెక్టర్
భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం లెంకలగడ్డలో ఈ రోజు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(Rahul Sharma), డిఎఫ్ఓ నవీన్ రెడ్డి, ఉద్యానవన శాఖ అధికారులతో కలిసి పర్యటించారు. గత మంగళవారం సుడిగాలులు బీభత్సం సృష్టించిన ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో సుడిగాలుల బీభత్సానికి నేలకొరిగిన మిర్చి, పత్తి పంటలను పరిశీలించి కలెక్టర్ బాధిత రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
బండలవాగు(Bandalawagu) సమీపంలోని అటవీప్రాంతంలో టోర్నోడ ప్రళయానికి వేర్లతోపాటు నేలకొరిగి, విరిగిపడిన చెట్లను డిఎఫ్ఓ నవీన్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ రాహుల్‌శర్మ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో టోర్నోడ రావడం తొలిసారి అన్నారు. గోదావరి నది(Godavari River) నుండి బారీ సుడిగాలులు అతివేగంగా పంటపొలాలు మీదుగా అటవీప్రాంతంలోకి వీచిందని, సుమారు 30 నుండి 40 ఎకరాల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నామన్నారు.
మిర్చి, పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయి. ఈ బీభత్సానికి ఎంత మేర నష్టం వాటిల్లిందని ప్రాథమిక సర్వే అనంతరం నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. డిఎఫ్ఓ నవీన్ రెడ్డి(DFO Naveen Reddy) మాట్లాడుతూ.. ఈ టోర్నోడ భీభత్సానికి 7 నుండి 8 హెక్టర్లలో ఫారెస్ట్ ద్వంసమైందని సుమారు 300 నుండి 400 చెట్లు దెబ్బతిన్నాయని, వాటి విలువ అంచనా వేసి ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపిస్తామన్నారు.


