COLLECTOR| టీచరమ్మగా మారిన కలెక్టర్

అంగన్వాడీలో పిల్లలకు పాఠాలు బోధించిన రాజకుమారి గణియా
COLLECTOR| నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ఆటపాటల ద్వారా చిన్నారుల్లో విద్య పట్ల ఆసక్తి కలిగించేందుకు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ అంగన్వాడి పిల్లల మధ్య కూర్చుని పాఠాలు చెప్పటం వారిని ఆకట్టుకునే విధంగా చిన్నారులకు విద్యాబోధన చేయటం అందరిని ఆకర్షించిన సంఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా బుధవారం జిల్లాలోని బేతంచెర్ల మండలంలోని అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు సంపూర్ణ పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.అంగన్వాడి కేంద్రంలోని చిన్నారులకు సంపూర్ణ పోషణలో భాగంగా గుడ్లు, పాలు వంటి పౌష్టికాహారాన్ని సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. వంట గదిలోకి వెళ్లి వంట పరిస్థితిని చూసి ఆమె కూడా వంటలో పాల్గొనటం విశేషం.
ప్రభుత్వం అందించే పౌష్టికాహారం పంపిణీలో ఎటువంటి సమస్యలు తలెత్తకూడదన్నారు. బరువు తక్కువ ఉన్న పిల్లలు, స్టెంటేడ్ పిల్లలకు కూడా అంగన్వాడి కేంద్రాలలో ఆహారం తినేలా చూడాలని.. వారికి ఐరన్ పోలిక్ యాసిడ్ మాత్రలను వేయించి క్రమం తప్పకుండా పౌస్టికాహారం ఇవ్వాలన్నారు. అదే విధంగా అంగన్వాడీ కేంద్రంలోని హాజరు పట్టిని ఇతర రిజిస్టర్లను పరిశీలిస్తూ పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడి కేంద్రంలోని పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుంటూ మరుగుదొడ్లను సుప్రపరుచుకోవాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. గర్భిణీ స్త్రీలకు అవసరమైన కిట్లను సమయానికి అందజేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అంగన్వాడీ సిబ్బందిని ఆదేశించారు. అంగన్వాడి కేంద్రంలో ఫ్యాన్లు, మంచినీరు వంటి మౌలిక వసతులు ఉన్నాయా లేదా అని అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ చిన్నారులకు పాఠాలు బోధించారు. గ్రామ ప్రజలు కలెక్టర్ సింపుల్ సిటీని చూసి మెచ్చుకోవటం విశేషం.
