కర్నూలు ఆసుపత్రిలో కలెక్టర్ సిరి ఆకస్మిక తనిఖీ..

కర్నూలు , ఆంధ్రప్రభ బ్యూరో : ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించాలంటూ జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులు, వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఉదయం కలెక్టర్ స్వయంగా ఆస్పత్రి విభాగాలను పరిశీలించి రోగులతో మాట్లాడి సేవల తీరును సమీక్షించారు.

క్యాజువాలిటీ, ఎమర్జెన్సీ, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, న్యూరో సర్జరీ, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ యూనిట్, మానసిక రోగుల వార్డు, డెర్మటాలజీ, ఫిమేల్ ఆర్థో, మేల్ ఆర్థో వార్డులను పరిశీలించిన కలెక్టర్, రోగుల ఆరోగ్య పరిస్థితులు, అందిస్తున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్యాజువాలిటీ వార్డులో చికిత్స పొందుతున్న తిమ్మప్ప కుటుంబ సభ్యులను కలెక్టర్ ప్రత్యక్షంగా పలకరించి, తగిన ఐసీయూ బెడ్ వెంటనే ఏర్పాటు చేయాలని జిజిహెచ్ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.

అలాగే, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ యూనిట్‌లో బస్సు ప్రమాదంలో గాయపడిన గుణ సాయిని పరామర్శించి వైద్యుల నుండి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో హృద్రోగ చికిత్స పొందుతున్న దేవదానం కుటుంబ సభ్యులతో, న్యూరో సర్జరీ వార్డులో చికిత్స పొందుతున్న 14 ఏళ్ల ప్రకాష్‌తో మాట్లాడారు. ప్రతి వార్డులోనూ రోగులను పలకరించి మందులు, భోజనం, వైద్యసేవలపై స్పందనలు తెలుసుకున్నారు.

వైద్యాధికారులతో మాట్లాడిన కలెక్టర్, ఆస్పత్రిలో ఎల్లప్పుడూ వైద్యులు అందుబాటులో ఉండాలని, రోగులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా తగిన సేవలు అందించాలన్నారు. వార్డులు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచి పరిశుభ్రత పాటించాలని ఆదేశించారు.

జిల్లాలో లెప్రసీ (కుష్టు వ్యాధి) నిర్మూలన దిశగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ లెప్రసీ అధికారిని ఆదేశించారు. ఆస్పత్రి ప్రాంగణం, నీరు, విద్యుత్, మరుగుదొడ్ల వంటి సౌకర్యాలు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. న్యూరో సర్జరీ, యూరాలజీ ఆపరేషన్ థియేటర్ల పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఏపిఎంఎస్ఐడిసి ఇంజనీర్లను కలెక్టర్ ఆదేశించారు. ఈ తనిఖీ సందర్భంగా జి.జి.హెచ్ సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు, ఇంచార్జి డీఎంహెచ్ఓ డా. భాస్కర్, జి.హెచ్ ఏఓ సింధు సుబ్రహ్మణ్యం కలెక్టర్‌తో పాటు ఉన్నారు.

Leave a Reply