కలెక్టర్ లక్ష్మీశ సంచలన ఉత్తర్వులు..

కలెక్టర్ లక్ష్మీశ సంచలన ఉత్తర్వులు..
- బిల్లుల్లేకుండా నిధుల మళ్లింపు
- క్లాప్ మిత్రల పేరిట రూ.21 లక్షల అక్రమ డ్రా
- సర్పంచి, కార్యదర్శిపై రికవరీ
- ఉపసర్పంచికి బాధ్యతల బదిలీ
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం పై పెనుగంచిప్రోలు గ్రామంలో వెలుగులోకి వచ్చిన అవకతవకలు జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీశాయి. సర్పంచి వేల్పుల పద్మకుమారి పై వచ్చిన ఆరోపణలు విచారణలో నిజమని తేలడంతో, జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కఠిన నిర్ణయం తీసుకుంటూ ఆమెను పదవి నుంచి బహిష్కరించారు. పదవీకాలం ముగియడానికి కేవలం ఒక్కరోజు ముందు ఈ చర్యలు తీసుకోవడం సంచలనంగా మారింది.
పూర్తి స్థాయి విచారణ..
ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు గ్రామ పంచాయతీ ఖాతాల్లో జరిగిన లావాదేవీల పై గత ఏడాది నవంబరు నుంచి ప్రత్యేక విచారణ చేపట్టిన అధికారులు, ఒక్కొక్కటిగా అవకతవకలను వెలికితీశారు. మొత్తం రూ.66.15 లక్షల ప్రభుత్వ నిధులు విధివిధానాలకు విరుద్ధంగా వినియోగించబడినట్లు నిర్ధారణకు వచ్చింది. అధికారిక బిల్లులు, ఓచర్లు లేకుండానే భారీ స్థాయిలో డబ్బులను డ్రా చేసినట్లుగా వెల్లడయింది. ముఖ్యంగా క్లాప్ మిత్రల జీతాలు పేరిట రూ.21.12 లక్షలను అక్రమంగా డ్రా చేసిన వ్యవహారం విచారణలో బయటపడింది. ఈ లావాదేవీలకు సంబంధించి సరైన రికార్డులు లేకపోవడం, నిధుల వినియోగంపై స్పష్టత లేకపోవడం విచారణలో తేలింది.
సర్పంచి-కార్యదర్శి ముఖ్యపాత్ర
ఈ అవకతవకల్లో సర్పంచితో పాటు పంచాయతీ కార్యదర్శి పాత్ర కూడా ఉన్నట్లు అధికారులు తేల్చారు. నిధుల విడుదల, వినియోగం పై ఇద్దరూ కలిసి వ్యవహరించినట్లు గుర్తించారు. పరిపాలనా బాధ్యతలను విస్మరించి, నిధులను పక్కదారి పట్టించినట్లు నిర్ధారణ కావడంతో ఇద్దరి పైనా చర్యలు ఉన్నతాధికారులు తీసుకున్నారు. దుర్వినియోగం చేసిన మొత్తం మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని సర్పంచి, కార్యదర్శిని బాధ్యులుగా చేస్తూ కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే ఆస్తుల జప్తు వంటి చర్యలకు కూడా వెనుకాడబోమని అధికార వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి.
పాలనలో అంతరాయం లేకుండా చర్యలు
గ్రామ పాలనలో ఎటువంటి అంతరాయం కలగకుండా సర్పంచి బాధ్యతలను తక్షణమే ఉప సర్పంచికి బదిలీ చేశారు. పరిపాలన సజావుగా కొనసాగేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తోంది. అధికారుల పర్యవేక్షణలో గ్రామ పరిపాలన కొనసాగిన ఉంది. నిధుల వినియోగంలో పారదర్శకత లేకపోతే, చిన్నస్థాయి పాలన వ్యవస్థల పైనా ప్రజల నమ్మకం దెబ్బతింటుంది. ఈ ఘటన తర్వాత ఇతర గ్రామ పంచాయతీల్లోనూ ఆర్థిక లావాదేవీల పై పర్యవేక్షణ మరింత కట్టుదిట్టం కావాల్సిన అవసరం ఉంది.
