Collector | మార్కుక్‌లో పర్యటించిన జిల్లా పాలనాధికారి

Collector | మార్కుక్‌లో పర్యటించిన జిల్లా పాలనాధికారి

  • కేజీబీవీలో మధ్యాహ్న భోజనం తనిఖీ
  • నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు
  • జిల్లా కలెక్టర్ కె. హైమావతి

Collector | మార్కుక్, ఆంధ్రప్రభ : జిల్లా పాలనాధికారి కె హేమావతి మంగళవారం మార్కుక్ మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన పథక అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, పరిమాణం, స్టాక్ నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు వడ్డించిన అన్నం, క్యారెట్ కూర, పప్పు, సాంబారు తదితర వంటకాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు ప్రకారం సరుకులు అందించారా? కొలతల ప్రకారం వంట చేశారా? అనే అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అయితే సరఫరా చేసిన కూరగాయల కొలతలకు వండిన వంటకు పొంతన లేదని గుర్తించి సంబంధిత ఎస్.ఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేసిన కలెక్టర్, రిజిస్టర్‌లో నమోదు చేయకుండా ఇష్టానుసారంగా సరుకులు వినియోగిస్తున్న తీరును తీవ్రంగా తప్పుబట్టారు. “మొక్కుబడిగా కొంత అన్నం, కూరలు చేసి పిల్లలకు పెడితే సరిపోతుందనుకోవద్దు. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం ఆడితే ఉపేక్షించేది లేదు” అని హెచ్చరించారు. విద్యార్థుల హాజరు ప్రకారం వంట చేయకపోవడం, రిజిస్టర్ నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత ఎస్.ఓపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)కు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు.

కేజీబీవీలను తరచూ తనిఖీ చేయాలని ఎంఈఓను కూడా ఆదేశించారు. రోజువారీ మెనూను తప్పనిసరిగా పాటిస్తూ, రుచికరమైన మరియు పోషక విలువలతో కూడిన భోజనం వండాలని వంట సిబ్బందికి స్పష్టం చేశారు. అలాగే విద్యార్థులు కూర్చున్న చోటుకే వెళ్లి ఆహారం వడ్డించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎవరిపైనైనా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని, వాటిని నిజమైన ప్రయోజనంగా మార్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Leave a Reply