Collector | వ్య‌ర్థాల‌ను వ‌న‌రులుగా మారుద్దాం..

Collector | వ్య‌ర్థాల‌ను వ‌న‌రులుగా మారుద్దాం..

  • స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ‌లో ముందుందాం..
  • స్వ‌ర్ణాంధ్ర‌-స్వ‌చ్ఛాంధ్ర కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ జి.ల‌క్ష్మీశ‌

Collector |నందిగామ, ఆంధ్రప్రభ : వ్య‌ర్థాలను స‌రైన ఆలోచ‌న‌, కార్యాచ‌ర‌ణ‌తో విలువైన వ‌న‌రులుగా మార్చ‌డం ద్వారా స‌ర్క్యుల‌ర్ ఎకాన‌మీతో
ఆర్థికంగా, సామాజికంగా, ప‌ర్యావ‌ర‌ణప‌రంగా బ‌హుముఖ ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ని ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు.
డిసెంబ‌ర్ నెల మూడో శ‌నివారం స్వ‌ర్ణాంధ్ర‌-స్వ‌చ్ఛాంధ్ర‌లో భాగంగా నందిగామ మునిసిపాలిటీ ప‌రిధిలో జ‌రిగిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు, సిబ్బందితో క‌లిసి క‌లెక్ట‌ర్ పాల్గొన్నారు. మొక్క‌లు నాటిన అనంత‌రం ఐసీడీఎస్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్ల‌ను ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ.. స్వ‌చ్ఛ‌త‌, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించడంతో పాటు వివిధ కార్య‌క్ర‌మాల్లో వారిని భాగ‌స్వాముల‌ను చేసే ఉద్దేశంతో ప్ర‌తినెలా మూడో శ‌నివారం ప్ర‌త్యేక థీమ్‌తో స్వ‌ర్ణాంధ్ర – స్వ‌చ్ఛాంధ్ర కార్య‌క్ర‌మాలను నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ నెల ప‌ర్యావ‌ర‌ణంలో అవ‌కాశాలు-స‌ర్క్యుల‌ర్ ఎకాన‌మీ ఇతివృత్తంతో కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. వ్య‌ర్థాల‌ను స‌రైన విధంగా నిర్వ‌హించ‌డం ద్వారా స‌ర్య్యుల‌ర్ ఎకాన‌మీకి బాట‌లు వేయొచ్చ‌ని.. చెత్త నుంచి సంప‌ద సృష్టి కేంద్రాల ద్వారా వ‌స్తున్న ఫ‌లితాలు ఇందుకు ఉదాహ‌ర‌ణ‌లు అని తెలిపారు.

విక‌సిత్ భార‌త్‌, స్వ‌ర్ణాంధ్ర @ 2047 సాకారానికి ముంద‌డుగుగా ప్ర‌తిఒక్క‌రూ స్వ‌చ్ఛ భార‌త్‌, స్వ‌చ్ఛాంధ్ర‌కు కృషిచేయాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని.. ప్ర‌కృతి వ్య‌వ‌సాయం, జ‌ల వ‌న‌రుల సంర‌క్ష‌ణ‌, పరిశుభ్ర‌త‌కు ప్రాధాన్య‌మివ్వ‌డం, ప్లాస్టిక్ వ‌స్తువుల వినియోగానికి దూరంగా ఉండ‌టం త‌దిత‌రాల వ‌ల్ల భావిత‌రాలకు స్వ‌చ్ఛ‌మైన ప‌ర్యావ‌ర‌ణాన్ని బ‌హుమ‌తిగా అందించేందుకు వీల‌వుతుంద‌న్నారు. 33 శాతం హ‌రిత విస్తీర్ణం ఉండాల‌ని, అయితే జిల్లాలో ఇది 25 శాతం ఉండాల‌ని, ఇందుకోసం గ్రామాల వారీగా ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకొని ముందుకెళ్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు.

స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ అవార్డుల‌కు కృషిచేయాలి
పారిశుధ్యం, హ‌రిత విస్తీర్ణం పెంపు, ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం, శుద్ధ ఇంధ‌న వినియోగం, ప‌రిశుభ్ర‌మైన రహ‌దారులు ఇలా వివిధ అంశాల్లో మెరుగైన ప్ర‌గ‌తి ద్వారా స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ అవార్డుల సాధ‌న‌కు కృషిచేయాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు. ప్ర‌కృతిని, ప‌ర్యావ‌ర‌ణాన్ని స‌రైన విధంగా అర్థం చేసుకొని ముంద‌డుగు వేయాలన్నారు.

వినూత్న ఆలోచ‌న‌ల ద్వారా ప‌రిస‌రాలు, నివాసాల ద్వారా ఉత్ప‌న్న‌మ‌య్యే వ్య‌ర్థాల‌ను వ‌న‌రులుగా ఉప‌యోగించుకుంటూ స్వ‌యం ఉపాధి, వాణిజ్య అవ‌కాశాల‌ను అందిపుచ్చుకోవ‌చ్చ‌ని వివ‌రించారు. త‌డిచెత్త‌, పొడిచెత్త‌ను వేరుచేసి ఇవ్వ‌డం వ‌ల్ల, ర‌సాయ‌న ఎరువుల వినియోగాన్ని త‌గ్గించి ప్ర‌కృతి సేద్యాన్ని అనుస‌రిస్తే
క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను వివ‌రించారు.

కార్య‌క్ర‌మంలో భాగంగా పారిశుధ్య‌ కార్మికుల‌ను క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌, ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌తో క‌లిసి స‌త్క‌రించారు. ప్లాస్టిక్ భూతంపై చిన్నారుల ప్ర‌ద‌ర్శ‌న‌లు ఆక‌ట్టుకోగా.. చిన్నారుల‌ను క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ప్ర‌త్యేకంగా అభినందించారు. కార్య‌క్ర‌మంలో నందిగామ ఆర్‌డీవో కె.బాల‌కృష్ణ‌, మునిసిప‌ల్ ఛైర్‌ప‌ర్స‌న్ మండ‌వ కృష్ణ‌కుమారి, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ లోవ‌రాజు, మెప్మా పీడీ ముర‌ళి, ఐసీడీఎస్ పీడీ రుక్సానా సుల్తానా బేగం పాల్గొన్నారు.

Leave a Reply