Collector | అమరజీవి ఆశయాలు స్ఫూర్తివంతం

Collector | అమరజీవి ఆశయాలు స్ఫూర్తివంతం
- పొట్టి శ్రీరాములు త్యాగం ఆంధ్రుల ఐక్యతకు ప్రతీక
- కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
Collector | శ్రీకాకుళం, డిసెంబర్ 15(ఆంధ్రప్రభ): అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం ఆంధ్రుల ఐక్యతకు ప్రతీక అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి సందర్భంగా సోమవారం పాత బస్టాండ్ సిగ్నల్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని, అమరజీవి త్యాగాన్ని తప్పక స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. అంటరానితనం నిర్మూలన, హరిజనుల ఆలయ ప్రవేశం వంటి సామాజిక సమస్యలపై ఆయన చేసిన పోరాటాలను ప్రస్తావించారు.
ఎమ్మెల్యే రమణమూర్తి మాట్లాడుతూ, అమరజీవి పొట్టి శ్రీరాములు భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతులై, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన త్యాగఫలితమే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిందని, నేటికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలలో స్థిరస్థాయిగా నిలిచిన మహనీయుడని శ్రీరాములను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి కె. సాయి ప్రత్యూష, బీసీ వెల్ఫేర్ అధికారి అనురాధ, స్థానిక తహసీల్దార్ గణపతి రావు, బీసీ వెల్ఫేర్ సూపరింటెండెంట్ మమత, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొని అమరజీవికి నివాళులర్పించారు.
