ధర్మపురి, ఆగస్టు 1 (ఆంధ్రప్రభ): ఫేషియల్ రికగ్నిషన్ యాప్ (Facial recognition app) ద్వారా ప్రభుత్వ అధికారులు, సిబ్బంది హాజరు నమోదును ప్రభుత్వం అందుబాటులోకి తేగా.. ఓ పంచాయతీ కార్యదర్శి (Panchayat Secretary) ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఫోటోను యాప్ లో అటెండెన్స్ (Attendance) కోసం అప్లోడ్ చేసిన వైనమిది..
స్పాట్ సెల్ఫీకి బదులు సీఎం ఫోటోను అప్లోడ్ చేసిన సదరు పంచాయతీ కార్యదర్శిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.. జగిత్యాల జిల్లా (Jagtial District) ధర్మపురి నియోజకవర్గం (Dharmapuri Constituency)లోని బుగ్గం మండలం చందయపల్లి పంచాయతీ కార్యదర్శి రాజన్నను విధుల నుంచి స స్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ (Collector Satya Prasad) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల అటెండెన్స్ (Employee Attendance) పక్రియ ఫేషియల్ రికగ్నేషన్ ద్వారానే కొనసాగుతోంది. వి ధులకు హాజరైన పంచాయతీ కార్యదర్శి స్పాట్ నుంచి సెల్ఫీని తీసి యాప్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కానీ, కొందరు ఫేషియల్ రికగ్నేషన్ యాప్ లో ప్రతి రోజూ ఒకే ఫోటో పెడుతుండటంతో అనుమానం వచ్చిన అధికారులు తనిఖీలు చేయగా, సీఎం ఫోటో అటెండెన్స్ లో ప్రత్యక్షం కావడం సంచలనం రేపుతోంది. చాలావరకు విధులకు హాజరుకాకుండా ఇలా అడ్డదారిలో కార్యాలయాలకు హాజరైనట్లుగా ఫోటోలను అప్లోడ్ చేస్తున్నారని అధికారులు గుర్తించారు. |