కర్నూలు బస్సు దుర్ఘటనపై సీఎం సమీక్ష

రవాణా భద్రతపై కఠిన ఆదేశాలు


కర్నూలు బ్యూరో, అక్టోబర్ 24, ఆంధ్రప్రభ : ప్రజల ప్రాణ భద్రతపై ఎటువంటి రాజీ ఉండదు. నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని తేలితే, సంబంధితులపై కఠిన చర్యలు తప్పవు అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) హెచ్చ‌రించారు. ప్రమాద ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అత్యవసరంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఉన్నతాధికారులు, ఇతర రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్ర‌మాద ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాల‌ని సీఎం అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.

ప్రమాదానికి కారణమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Private Travels Bus) రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్, పర్మిట్ వివరాలను సేకరించి పూర్తి నివేదిక అందించాలని సీఎం ఆదేశించారు. రవాణా శాఖకు అన్ని జిల్లాల్లో ప్రైవేట్, ప్రభుత్వ బస్సులపై సాంకేతిక తనిఖీలు వెంటనే ప్రారంభించాలన్నారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, భద్రతా ప్రమాణాలపై కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. మృతుల వివరాలు గుర్తించి కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం అందించాలని సీఎం ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా వైద్యశాఖకు ప్రత్యేక సూచనలు ఇచ్చారు.


రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Ramprasad Reddy) ప్రమాద స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి ప్రభుత్వ తరఫున అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల భద్రతే ప్రభుత్వానికి ప్రాధాన్యత.. బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం త్వరితగతిన అందజేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కర్నూలు ప్రమాదం రాష్ట్ర రవాణా భద్రతా వ్యవస్థలో ఉన్న లోపాలను మళ్లీ బహిర్గతం చేసింది. ప్రైవేట్ ట్రావెల్స్‌పై సమగ్ర తనిఖీలు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల ధ్రువీక‌ర‌ణ, డ్రైవర్ శిక్షణ వంటి అంశాలు ఇకపై కఠినంగా అమలు అయితేనే ఇలాంటి విషాదాలు నివారించగలుగుతామ‌ని తెలిపారు.

Leave a Reply